ఎస్పీవై రెడ్డి నిర్ణయంపై ఉత్కంఠ: టీడీపీ, జనసేన ఎదురుచూపులు

By Nagaraju penumalaFirst Published Mar 28, 2019, 1:50 PM IST
Highlights

ఎస్పీవైరెడ్డికి కొన్ని నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లి నియోజకవర్గాలలో మంచిపట్టుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనతోపాటు వారసులను కూడా బరిలోకి దింపారు. ఎస్పీవైరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు బరిలో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ బుజ్జగింపులకు దిగింది. నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆఫర్ ఇచ్చారు

అమరావతి: కర్నూలు జిల్లాలో మార్మోగుతున్న పేరు ఎస్పీవై రెడ్డి. తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారు ఎస్పీ వైరెడ్డి.  అయితే టీడీపీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా మాండ్ర శివానందరెడ్డిని బరిలోకి దించారు చంద్రబాబు. 

టికెట్ ఆశించి భంగపడటంతో ఎస్పీ వైరెడ్డి ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు.నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి జనసేన తరపున పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ తరపున ఎస్పీ వైరెడ్డి తోపాటు కుటుంబ సభ్యులు కూడా పోటీ చేస్తున్నారు. 

ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన తరపున పోటీ చేస్తున్నారు. పెద్దకుమార్తె సుజలారెడ్డి శ్రీశైలం అభ్యర్థిగా పోటీ చేస్తుండగా చిన్న కుమార్తె అరవిందరాణి బనగానిపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

ఎస్పీవైరెడ్డికి కొన్ని నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లి నియోజకవర్గాలలో మంచిపట్టుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనతోపాటు వారసులను కూడా బరిలోకి దింపారు. ఎస్పీవైరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు బరిలో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ బుజ్జగింపులకు దిగింది. 

నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆఫర్ ఇచ్చారు. ఎస్పీవైరెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుని టీడీపీ అభ్యర్థి గెలుపుకు సహకరిస్తే ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆయన కటుంబం నుంచి ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పుకొచ్చారు. 

అంతేకాదు కొన్ని పరిస్థితుల వల్ల టికెట్ ఇవ్వలేకపోయామని పార్టీలోకి వస్తే గౌరవంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు కేంద్రమాజీమంత్రి సుజనా చౌదరిని రాయబారిగా పంపించారు. 

ఎస్పీవై.రెడ్డి పెద్దకుమార్తె సుజలారెడ్డితో సుజనా చౌదరి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చర్చలు జరిపారు కానీ నామినేషన్లు ఉపసంహరణపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఎస్పీ వైరెడ్డి కుటుంబం ఎన్నికల బరిలో ఉంటే టీడీపీ అభ్యర్థుల గెలుపు కష్టమని స్పష్టం చెయ్యడంతో చంద్రబాబు ఎస్పీవైరెడ్డిని ఉపసంహరించుకునేందుకు కీలక నేతలను రంగంలోకి దింపారు. 

టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ను రంగంలోకి దింపారు. ఎస్పీ వై రెడ్డితో మాట్లాడి ఆయన, ఆయన కుటుంబం నామినేషన్లు విత్ డ్రా చేసుకునేలా ఒప్పించాలని ఆదేశించారు. దీంతో టీజీ వెంకటేష్ ఎస్పీవైరెడ్డి ఇంటికి వెళ్లారని ప్రచారం. 

మరోవైపు ఎస్పీవైరెడ్డి నిర్ణయంపై జనసేన పార్టీకూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎవరికీ ఇవ్వనన్ని సీట్లు ఎస్పీ వైరెడ్డి కుటుంబానికి ఇచ్చామని ఒకే కుటుంబం నుంచి నలుగురికి అవకాశం కల్పించామని ఆ పార్టీ భావిస్తోంది. 

ఇలాంటి తరుణంలో నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే నాలుగు సీట్లు పోటీచెయ్యకుండా పోతామనే భావనలో ఉంది. పార్టీ వీడొద్దంటూ కొందరు జనసేన నేతలు ఎస్పీ వైరెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నాం 3 గంటల వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు సమయం ఉండటంతో ఎస్పీ వైరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. 
 

click me!