టీడీపీలో టికెట్ల చిచ్చు... పశ్చిమలో రెబల్స్‌ రగడ

By Siva KodatiFirst Published Mar 21, 2019, 6:26 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో తెలుగుదేశం పార్టీకి అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో టికెట్లు ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో తెలుగుదేశం పార్టీకి అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో టికెట్లు ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.

కొత్తపల్లి సుబ్బారాయుడు:
నరసాపురం టిక్కెట్ ఈసారి తనకు తప్పకుండా దక్కుతుందని భావించిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కు టీడీపీ అధిష్టానం షాకిచ్చింది. దీంతో పార్టీపై అలిగిన కొత్తపల్లి... వెనువెంటనే కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పదవితో పాటు ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు.

అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. జనసేన నుంచి నర్సాపురం టికెట్‌ కోసం ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కుదరని పక్షంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని సుబ్బారాయుడు భావిస్తున్నారు.

చెరుకూరి రామకృష్ణ చౌదరి:
భీమవరానికి చెందిన నందమూరి యువసేన జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రామకృష్ణ చౌదరి భీమవరం టికెట్ ఆశించారు. అయితే చంద్రబాబు మరోసారి పులపర్తి రామాంజనేయలకే కేటాయించారు.

దీంతో అసంతృప్తికి గురైన చెరుకూరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ మేరకు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. 

డైలమాలో పీతల సుజాత: 
చింతలపూడిలో టికెట్ ఆశించిన మాజీ మంత్రి పీతల సుజాతకు చంద్రబాబు షాకిచ్చారు. నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉండటంతో సుజాత స్థానంలో కర్రా రాజారావుకు అవకాశం కల్పించారు.

కర్రా నామినేషన్ కార్యక్రమానికి పీతల వర్గం డుమ్మా కొట్టింది. దీంతో ఎలాంటి హడావిడి లేకుండా రాజారావు కారులో వచ్చి నామినేషన్ వేసి వెళ్లిపోయారు.

click me!