
అమరావతి: తన పేరు మీద ఓ తప్పుడు వ్యాఖ్యను ప్రచారంలో పెట్టడంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు.
తన పేరు మీద ప్రచారంలోకి వచ్చిన తప్పుడు ట్వీట్ ను తన ట్వీట్ కు ఆయన జత చేశారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో, వారి మీద మీరు నమ్మకం కోల్పోయిన స్థితిలో తిట్లు, అబద్ధాలు ఇవి అని ఆయన అన్నారు.
కొద్ది గంటల్లో పోలింగ్ ముగియనున్న స్థితిలో తప్పుడు వార్తలను ప్రచారంలోకి తెచ్చావని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పును ఎలా ఇవ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.
వైఎస్ జగన్ తో కలిసి రెండేళ్లు పడిన శ్రమ వృధా అయిందంటూ, జగన్ తో కలిసి పనిచేసినందుకు జీవితాంతం బాధపడే స్థితి ఏర్పడిందంటూ ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేసినట్లు సమాచారం ప్రచారంలోకి వచ్చింది. ఆ ట్వీట్ బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ప్రచారంలోకి వచ్చింది. దానిపై ప్రశాంత్ కిశోర్ గురువారం మధ్యాహ్నం స్పందించారు.