
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుండు గీయించుకున్న పవన్ కళ్యాణ్ కావాలా? ప్రపంచాన్ని శాసించే పాల్ కావాలో ఆలోచించుకోవాలంటూ కాపు సామాజిక వర్గాన్ని ప్రశ్నించారు.
విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ రాబోయే ఎన్నికల్లో పవన్‌కు నాలుగు శాతం ఓట్లు కూడా రావని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో ఎవరూ భాగుపడరన్నారు. అంతా నాశనమేనంటూ శాపనార్థాలు పెట్టారు.
మతిభ్రమించిన వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. వైసీపీకి ఒక్క ఓటు కూడా వేయోద్దని సూచించారు. జగన్ కి ఓటేస్తే దేవుని విరోధులు అవుతారంటూ చెప్పుకొచ్చారు.
దేవుడి శాపం తగులుతుందని హెచ్చరించారు. అలాగే రాష్ట్రాన్ని పట్టించుకోని తెలుగుదేశం పార్టీకి కూడా ఓటేయోద్దని సూచించారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాలని హితవు పలికారు.