
ఏపీలో ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. ప్రత్యర్థులపై ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు. చంద్రబాబు.. జగన్ పై విమర్శలు చేస్తే.. జగన్ చంద్రబాబు, పవన్ లపై విమర్శలు చేస్తున్నారు. ఇక పవన్.. చంద్రబాబు, జగన్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు.
అయితే.. పవన్.. ఎలాంటి ఆధారాలు లేకుండా జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ పై సంచలన కామెంట్స్ చేశారు.
జగన్‌పై పలు ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్, వాటిని నిరూపిస్తే, తాను ఆయన కాళ్లకు నమస్కరించి, పాలాభిషేకం చేస్తానని ఉద్ఘాటించారు. జగన్ అవినీతిపై ఆధారాలు ఇస్తే, తన ఇంట్లోని జగన్ బొమ్మ తీసేసి పవన్ ఫోటోను పెట్టుకుంటానన్నారు. జగన్ చాలా గొప్ప వ్యక్తని, క్యారెక్టర్ ఉన్న మనిషని, ఆయనను పవన్ ఎందుకు అపార్థం చేసుకున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, లోకేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయనకు డబ్బు, మందు, అమ్మాయిలు తప్ప మరో ధ్యాస లేదంటూ కొన్ని పాత ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారు. జగన్ గానీ ఇదే తరహాలో ఫోటోలో ఉండి, రాధాకృష్ణకు దొరికుంటే, అంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో నిత్యమూ వేసుండేవారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
70 ఏళ్ల వయసున్న లక్ష్మీ పార్వతిపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని, అమ్మమ్మ వయసులో ఉన్న ఆమెపై ఈ తరహా ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.