నేను చిరుతో ఉండడం వల్లే జనసేన టికెట్ రాలేదు, పవన్ ఎంపిక కాదు: జనసేన నేత

By Nagaraju penumalaFirst Published Mar 26, 2019, 6:10 PM IST
Highlights

జనసేన సీట్లు టీడీపీ కేటాయించినట్లు అనుమానంగా ఉందన్నారు. పెద్దాపురంలో మీడియాతో మాట్లాడిన పంతం గాంధీమోహన్ జనసేన పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలో అభ్యర్థులకు టికెట్లు ఎలా ఇచ్చారో గుండెల మీద చెయ్యివేసుకుని ఆలోచించాలని సూచించారు. 

కాకినాడ: జనసేన పార్టీ అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ఎంపిక చేసినట్లు లేదని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ ఆరోపించారు. జనసేన సీట్లు టీడీపీ కేటాయించినట్లు అనుమానంగా ఉందన్నారు. 

పెద్దాపురంలో మీడియాతో మాట్లాడిన పంతం గాంధీమోహన్ జనసేన పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలో అభ్యర్థులకు టికెట్లు ఎలా ఇచ్చారో గుండెల మీద చెయ్యివేసుకుని ఆలోచించాలని సూచించారు. 

పెద్దాపురం టికెట్ ఆశించి భంగపడ్డ పంతం గాంధీమోహన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జనసేన పార్టీ అభ్యర్థి తుమ్మల రామస్వామికి సహకరించబోమని స్పష్టం చేశారు. పెద్దాపురం టికెట్ ఎవరికి ఇస్తున్నారో అన్న అంశంపై కనీసం తనను సంప్రదించలేదని ఆరోపించారు. 

మెగాస్టార్ చిరంజీవిని అంతా వదిలి వెళ్లిపోయినా తాను ఒక్కడినే ఆయన వెన్నంటి ఉన్నానని తెలిపారు. చిరంజీవికి చెప్పే తాను జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. తాను చిరంజీవితో ఉండటం వల్లే టికెట్ రాలేదోమోనని భావిస్తున్నట్లు తెలిపారు.
 
చిరంజీవికి అన్యాయం జరిగిందని ప్రతి సమావేశంలో పవన్ పదేపదే చెప్తుంటారని మరి తనకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకొచ్చారు. 

గతంలో గెలవడంతో తనకు ప్రాధాన్యత ఇస్తారని అనుకున్నానని కానీ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని చెబుతున్న పవన్‌ టికెట్లు ఎలా కేటాయించారో ఒకసారి ఆలోచించుకోవాలని పంతం గాంధీ మోహన్ సూచించారు.  

click me!