టీడీపీ అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ దాడులు

By narsimha lodeFirst Published Apr 3, 2019, 5:37 PM IST
Highlights

కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై బుధవారం నాడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

కడప: కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై బుధవారం నాడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులోని పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సుధాకర్ యాదవ్ ఇటీవల వరకు టీటీడీ ఛైర్మెన్ గా కూడ కొనసాగారు. ఆ పదవికి ఆయన ఇటీవలనే రాజీనామా చేశారు.

బుధవారం మధ్యాహ్నం పుట్టా సుధాకర్ యాదవ్ ప్రచారాన్ని ముగించుకొని భోజనానికి ఇంటికి వచ్చిన సమయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సుధాకర్ ఇంట్లో నుండి ఐటీ అధికారులు కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నట్టుగా ప్రచారం సాగుతోంది.ఉద్దేశ్యపూర్వకంగానే తమ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారని  సుధాకర్ యాదవ్ ఆరోపిస్తున్నారు.

2014 ఎన్నికలకు ముందే పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీలో చేరారు. అప్పటి నుండి ఆయన మైదుకూరు అసెంబ్లీ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి రఘురామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోసారి ఇదే స్థానం నుండి ఆయన పోటీ చేస్తున్నారు.

సుధాకర్ యాదవ్ ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకు వియ్యంకుడు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి కూడ దగ్గరి బంధువు అవుతారు. ఎన్నికలకు 8 రోజుల ముందే సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే టీడీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న మరో ఇద్దరిపై ఇప్పటికే ఐటీ సోదాలు జరిగాయి. నెల్లూరు  సిటీ నుండి పోటీ చేస్తున్న పి. నారాయణ, ప్రకాశం జిల్లా కనిగిరి  అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన ఆసుపత్రిపై కూడ ఐటీ సోదాలు నిర్వహించారు. తాజాగా పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.

ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలలకు చెందిన టీడీపీ నేతలు, టీడీపీ అభ్యర్థుల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న తరహాలోనే ఏపీలోనే ఐటీ సోదాలు జరగుతున్నాయని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

click me!