
అమరావతి: తెలంగాణ సీఎం,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సినీ నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జిత్తుల మారి నక్క అంటూ రెచ్చిపోయారు. అమరావతిలో సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన శివాజీ ఆంధ్రులెవరూ కేసీఆర్ మాటలు నమ్మరన్నారు.
కేసీఆర్, వైఎస్ జగన్ ఇద్దరూ కలిసి ప్రత్యేక హోదా డ్రామాలాడుతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టుకు తప్పుచేశామని లెటర్ ఇస్తే అప్పుడు నమ్ముతామంటూ చెప్పుకొచ్చారు. ఏపీకి రావాల్సిన లక్ష కోట్లు ఇవ్వలేదని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
కేసీఆర్, జగన్, మోదీ ముగ్గురూ ఒక్కరేనని చెప్పుకొచ్చారు. మోదీకి నెంబర్ గేమ్ కావాలి కాబట్టే కేసీఆర్‌తో ఇలా చెప్పించారని ఆరోపించారు. కేసీఆర్‌వి అన్నీ మాయమాటలేనని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలను మోసం చేయడానికి రాజధానిని తరలించడానికి కుట్రలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.
హైదరాబాద్‌లో కుక్కల్లా బతుకుతూనే ఉండాలా అంటూ మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడబోతోందన్న శివాజీ కేసుల నుంచి బయటపడటానికి జగన్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పుకొచ్చారు. దమ్ముంటే కేసీఆర్ ఏపీలో జగన్‌కు మద్దతిస్తున్నామని సూటిగా చెప్పాలన్నారు.
మోదీ ప్రధాని అవడానికి ఏపీ ప్రజలు బలికావాలా అంటూ నిలదీశారు. జగన్‌కి కేసీఆర్, కేటీఆర్ సహాయం చేస్తున్నారని విమర్శించారు. రోజూ సాయంత్రం జగన్ హైదరాబాద్‌కు వెళ్తున్నారని ఆరోపించారు. కలిసి పనిచేసుకోవడం తప్పుకాదని అయితే కుట్రలు చెయ్యడం తప్పన్నారు.
పోలవరాన్ని ఆపేందుకే జగన్‌పై కేసీఆర్‌కు ప్రేమ అంటూ ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుపై నీ కూతురు కేసులు పెట్టింది, అల్లుడు అడ్డుకున్నాడని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై గల్లా జయదేవ్ మాట్లాడుతుంటే తెలంగాణ ఎంపీలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
మోదీ మీద ప్రేమతో జగన్‌ని బలిపశువుని చేయబోతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలకు కేసీఆర్ చేసిన అవమానాలకు తిరిగి సమాధానం చెప్పే రోజు వస్తుందని హీరో శివాజీ హెచ్చరించారు.