ఎగ్జిట్ పోల్ ఫలితాలు: రాజకీయ తెరపై పవన్ కల్యాణ్ అట్టర్ ఫ్లాప్

By telugu teamFirst Published May 20, 2019, 12:04 PM IST
Highlights

ఎక్కువ ఏజెన్సీలు పవన్ కల్యాణ్ జనసేనకు పది లోపల సీట్లే వస్తాయని అంచనా వేశాయి. ఎక్కువకు ఎక్కువ ఐదు సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కొన్ని సర్వేలయితే ఒక్కటే సీటు వస్తుందని అంచనా వేశాయి.

అమరావతి: ఎన్నికల రాజకీయ తెరపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన చతికిలపడే సూచనలు కనిపిస్తున్నాయి. జనసేనకు వచ్చే సీట్ల సంఖ్య రెండంకెలకు చేరుకునే అవకాశం కూడా లేదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీకి వచ్చినన్ని సీట్లు కూడా పవన్ కల్యాణ్ జనసేనకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. 

ఎక్కువ ఏజెన్సీలు పవన్ కల్యాణ్ జనసేనకు పది లోపల సీట్లే వస్తాయని అంచనా వేశాయి. ఎక్కువకు ఎక్కువ ఐదు సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కొన్ని సర్వేలయితే ఒక్కటే సీటు వస్తుందని అంచనా వేశాయి. దీన్నిబట్టి పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట మాత్రమే గెలిచే అవకాశం ఉంది. 

పవన్ కల్యాణ్ ఇటు భీమవరంలోనూ అటు గాజువాకలోనూ పోటీ చేశారు. ఆయన గాజువాకలో గెలిచే అవకాశాలు మాత్రమే ఉన్నాయని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. అయితే, తన పార్టీ అధికారంలోకి వస్తుందని పవన్ కల్యాణ్ కూడా నమ్మినట్లు లేరు.

తనది సుదీర్ఘ రాజకీయ పోరాటమని, అందుకు తనకు సహనం ఉందని ఆయన చెబుతూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆయన మరో ఐదేళ్లు ఆగాల్సి ఉంటుంది. ఈ ఐదేళ్లు ఆయన తన పార్టీని కాపాడుకోగలరా అనేది ప్రశ్న.  

సిపిఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. జనసేనకు ఒక్క సీటు మాత్రమే వస్తుంది. ఐఎన్ న్యూస్- ఐ పల్స్ సర్వే ప్రకారం మూడు సీట్లు వస్తాయి. జనసేనకు జీరో నుంచి 4 సీట్లు రావచ్చునని వీడీపీ సర్వే అంచనా వేసింది.  ఐఎన్ఎస్ఎస్ ఐదు సీట్లు వస్తాయని చెప్పింది. 

రెండు సీట్లు వస్తాయని పోల్లాబ్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. ఆరా సర్వే జనసేనకు 2 సీట్లు వస్తాయని చెప్పింది. ఒక్క సీటు మాత్రమే వస్తుందని ఎలైట్ సర్వే చెప్పింది. మిషన్ చాణక్య మాత్రమే జనసేనకు 10 నుంచి 13 సీట్లు వస్తాయని చెప్పింది.

ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు చూస్తుంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కింగ్ కాలేకపోయినా కింగ్ మేకరైనా అవుదామనే పవన్ కల్యాణ్ ఆశలు పూర్తిగా అడుగంటినట్లే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయంగా చురుగ్గా ఉండే అవకాశాలు కూడా లేవు. ఇప్పటికే ఆయన సినిమాల్లో నటించడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. 

click me!