2004 రిపీట్, చంద్రబాబు ఓటమి తప్పదు: వైసీపీలో చేరిన మాజీమంత్రి డీఎల్

By Nagaraju penumalaFirst Published Mar 29, 2019, 4:16 PM IST
Highlights

2004లో వైఎస్‌ఆర్ చేతిలో చంద్రబాబు ఎలా ఓడిపోయారో అలాగే 2019లో వైఎస్‌ జగన్‌ చేతిలో చంద్రబాబుకు పరాజయం  అని ఒక ఇంగ్లీషు దినపత్రిక రాసిందని అది నిజం కాబోతుందని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు. 

కడప : మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మైదుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన వైసీపీ కండువాకప్పుకున్నారు. 

వైఎస్ జగన్ ఆయకు కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీఎల్ రవీంద్రారెడ్డి జగన్ పై ప్రశంసలు కురిపించారు. నువ్వు నేను కలిస్తే, మనం, మనం... మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే కలిస్తే వైఎస్ జగన్‌ అన్నారు. 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ప్రియ మిత్రుడు అని ఆయన తనయుడు వైఎస్ జగన్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ ధీమా వ్యక్తం చేశారు. 

రాబోయే ఎన్నికల్లో మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి అవినాష్‌ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు తన పాలనలో ఎన్నో అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నారని అవినీతిని పెంచిపోషించారని ఆరోపించారు. 

జన్మభూమి కమిటీలు తమవారికే న్యాయం చేసకున్నాయని విమర్శించారు. విలువైన ఓటు ద్వారా చంద్రబాబుకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. 2004లో వైఎస్‌ఆర్ చేతిలో చంద్రబాబు ఎలా ఓడిపోయారో అలాగే 2019లో వైఎస్‌ జగన్‌ చేతిలో చంద్రబాబుకు పరాజయం  అని ఒక ఇంగ్లీషు దినపత్రిక రాసిందని అది నిజం కాబోతుందని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు. 
 

click me!