మైలవరం ముఖచిత్రం: దేవినేని ఉమపై జగన్ పక్కా స్కెచ్

By narsimha lodeFirst Published Mar 22, 2019, 5:40 PM IST
Highlights

కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య  తీవ్రమైన పోటీ నెలకొంది. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో  కీలక మంత్రిగా ఉన్న దేవినేని ఉమా మహేశ్వర రావు‌పై  వైసీపీ ఈ దఫా మాజీ మంత్రి వసంత కృష్ణ ప్రసాద్‌ను  బరిలోకి దింపింది. 

మైలవరం: కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య  తీవ్రమైన పోటీ నెలకొంది. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో  కీలక మంత్రిగా ఉన్న దేవినేని ఉమా మహేశ్వర రావు‌పై  వైసీపీ ఈ దఫా మాజీ మంత్రి వసంత కృష్ణ ప్రసాద్‌ను  బరిలోకి దింపింది. దేవినేనిని ఓడించాలనే లక్ష్యంతో వైసీపీ పావులు కదుపుతోంది. ఈ స్థానంలో హ్యాట్రిక్ సాధించేందుకు దేవినేని ఉమా వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడు.

 కృష్ణా జిల్లాలోని మైలవరం అసెంబ్లీ సెగ్మెంట్‌పైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. 1999 నుండి దేవినేని ఉమా మహేశ్వర్ రావు వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని నందిగామ నుండి దేవినేని ఉమ మహేశ్వర్ రావు 1999 నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధిస్తున్నాడు.2009లో నియోజకవర్గాల పునర్విభజన  జరిగింది.  ఈ సమయంలో నందిగామ అసెంబ్లీ సెగ్మెంట్ ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దీంతో దేవినేని ఉమ మహేశ్వర రావు  మైలవరం నుండి పోటీ చేస్తున్నారు.

2009, 2014 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుండి దేవినేని ఉమ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. ఇదే సెగ్మెంట్ నుండి హ్యాట్రిక్ కోసం ఆయన మరోసారి పావులు కదుపుతున్నారు.

1999లో నందిగామలో కాంగ్రెస్ అభ్యర్ధిగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌పై  దేవినేని విజయం సాధించారు.2004 ఎన్నికల్లో మాజీ మంత్రి వసంత నాగేశ్వర్ రావు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయగా, టీడీపీ అభ్యర్ధిగా దేవినేని పోటీ చేసి విజయం సాధించారు.

ఆరు మాసాల  క్రితం వరకు వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో కొనసాగారు  ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. మైలవరంలో దేవినేనిని ఢీకొట్టేందుకు వైసీపీ వెంకటకృష్ణ ప్రసాద్‌ను మైలవరంలో బరిలోకి దింపింది.

ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు పోలీసులకు లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇదంతా మంత్రి దేవినేని  కుట్రలో భాగమేనని వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ చేశారు.

దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్  ఇటీవలనే టీడీపీ నుండి వైసీపీలో చేరారు.  2014 ఎన్నికలకు ముందు దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్  వైసీపీలోనే ఉన్నాడు. ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరారు. దేవినేని చంద్రశేఖర్‌ను వైసీపీలో చేర్పించడంలో వసంత కృష్ణ ప్రసాద్ కీలకంగా వ్యవహరించారు. ఈ పరిణామం రాజకీయంగా దేవినేనికి కొంత ఇబ్బందేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని దేవినేని ఉమ ఆశాభావంతో ఉన్నారు. దేవినేనిని  దెబ్బతీసేందుకు వైసీపీ నేతలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. 

టీడీపీకి చెందిన బూత్ కన్వీనర్లకు వైసీపీ నేతలు పోన్లు చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్‌ ఉంది. 23 ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగునీరు ఇప్పించారు. టీడీపీ నేతల్లో అనైక్యత, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసుకోకపోవడం టీడీపికి మైనస్ పాయింట్స్‌గా ఉన్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

ఇక వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ బలహీనతలను తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.  వెంకట కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు‌కు పాతతరం  నేతలతో ఉన్న సంబంధాలు వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించే అవకాశాలు లేకపోలేదు. వైసీపీకి ఈ నియోజకవర్గంలో అసంతృప్తులు ఏ మేరకు సహాయం చేస్తారోననేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఈ నియోజకవర్గంలో మొత్తం 2,68,463 మంది ఓటర్లున్నారు. వీరిలో బీసీలు 1,20,000 మంది, కమ్మ, ఎస్సీ సామాజిక ఓటర్లు 40వేల చొప్పున ఉంటారు. రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు 16 వేలు, కాపు సామాజిక ఓటర్లు 25 వేలు, బ్రహ్మణ సామాజిక ఓటర్లు మూడు వేలు ఉంటారు.ఈ రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే.  ఓటర్లు ఏ అభ్యర్ధి వైపుకు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.


 

click me!