రాజమౌళి గ్రేట్: ఏపీ ఎన్నికల్లో ‘బాహుబలి’ ఫీవర్

By ramya NFirst Published Apr 2, 2019, 12:55 PM IST
Highlights

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం రెండో భాగం విడుదలై కూడా రెండు సంవత్సరాలు పూర్తౌతోంది. కానీ ఆ సినిమా ప్రభావం మాత్రం ఇంకా పోలేదు. 

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం రెండో భాగం విడుదలై కూడా రెండు సంవత్సరాలు పూర్తౌతోంది. కానీ ఆ సినిమా ప్రభావం మాత్రం ఇంకా పోలేదు. అందుకు ఉదాహరణ ఏపీ ఎన్నికలే.

అదేంటి ఏపీ ఎన్నికలకు బాహుబలి సినిమాకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? అక్కడికి వేస్తున్నాం.. బాహుబలిలోని క్యారెక్టర్ల పేర్లతో.. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఒకరిని మరొకరు దూషించుకుంటున్నారు. తమను తాము బాహుబలిలా పోల్చుకుంటూ.. ప్రత్యర్థులను మాత్రం బల్లాలదేవ, బిజ్జాల దేవలతో పోలుస్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనను తాను బహుబలిలా పోల్చుకుంటున్నారు. కాగా.. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం చంద్రబాబుని బిజ్జాల దేవతో పోల్చేశారు. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. చంద్రబాబుని బిజ్జాలదేవతో పోల్చేశారు.

మరి మోదీ అన్న కామెంట్స్ కి టీడీపీ నేతలు ఊరుకుంటారా.. అందుకే మోదీపై కూడా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా మోదీపై సెటైర్లు వేస్తూ... ఆయనను కాలకేయుడు క్యారెక్టర్ తో పోల్చడం గమనార్హం. 

అంతేకాదు.. కన్నాలక్ష్మీ నారాయణ కూడా లోకేష్ పై విమర్శలు చేశారు. బాహుబలిని సినిమాలో అప్పటివరకు ఎంతో విశ్వాసంగా ఉండే కట్టప్పే హత్య చేస్తాడన్న విషయం తెలిసిందే. కాగా.. లోకేష్.. చంద్రబాబు జీవితంలో కట్టప్ప అవుతాడంటూ కన్నా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

 ఈవిధంగా ఏపీ ఎన్నికల ప్రచారంలో బాహుబలి సినిమాలోని క్యారెక్టర్ల పేర్లు తెగ హల్ చల్ చేస్తున్నాయి. కేవలం ఏపీ ఎన్నికలే కాదు.. ఐపీఎల్ లో కూడా బాహుబలి తన ప్రతిభ చాటుతోంది. తాజాగా హైదరాబాద్ సన్‌రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు అవకాశం వస్తే సినిమాల్లో నటించాలని ఉందని అది కూడా బాహుబలి లాంటి సినిమాలో నటించాలని చెప్పడం విశేషం. 

తన సినిమా ఇంతలా ఇంపాక్ట్ చూపిస్తుందని రాజమౌళి కూడా అనుకోని ఉండరు..

click me!