బ్రాహ్మణి స్టీల్స్ కు శంకుస్థాపన చేస్తాడట, గాలికి అమ్మేస్తాడు: జగన్ పై బాబు

By telugu teamFirst Published Apr 6, 2019, 11:14 AM IST
Highlights

కేసుల భయం చూపి బిజెపి జగన్ ను లొంగదీసుకుందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల తర్వాత వైసిపిని బిజెపిలో కలిపేయడం ఖాయమని ఆయన అన్నారు. జగన్ ఎన్డీఎలోకి వస్తారని అథవాలే అనడమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. 

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణి స్టీల్స్ కు ఆరు నెలల్లో శంకుస్థాపన చేస్తానని జగన్ చెబుతున్నారని, ఇనుప ఖనిజం మొత్తాన్ని గాలి జనార్దన్ రెడ్డికి అమ్మేస్తారని ఆయన అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

కేసుల భయం చూపి బిజెపి జగన్ ను లొంగదీసుకుందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల తర్వాత వైసిపిని బిజెపిలో కలిపేయడం ఖాయమని ఆయన అన్నారు. జగన్ ఎన్డీఎలోకి వస్తారని అథవాలే అనడమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. దర్యాప్తు సంస్థలనే కాదు ఈసీని కూడా దుర్వినియోగం చేస్తున్నారని, అక్రమ మార్గాల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన బిజెపిపై ధ్వజమెత్తారు

ఆస్తుల కోసం జగన్ వైసిపిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు అమ్మేశారని అన్నారు. కరెన్సీ నోట్లను విదజల్లే అహంభావం వైసిపి నేతలదని ఆయన అన్నారు. వైసిపి అభ్యర్థుల్లో సగం మంది నేర చరితులేనని ఆరోపించారు. 12 మంది ఎంపీ అభ్యర్థులపై, 92 మంది ఎమ్మెల్యే అభ్యర్థులపై కేసులున్నాయని ఆయన గుర్తు చేశారు. తప్పుడు పనులకు వైసిపి నేతలు తెగించారని ఆయన అన్నారు. 

ముందుగా తెలుగు వారందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు పలు పథకాలపై ప్రకటనలు చేశారు. ఇకపై ప్రతి ఏటా పసుపు-కుంకుమ పథకం కింద నగదు అందజేస్తామని ఆయన తెలిపారు. రాబోయే ఐదేళ్లలో రూ.50 వేలు చొప్పున చెల్లెమ్మలకు ఇస్తామని ప్రకటించారు. పేదరికం నిర్మూలనకే ప్రతి ఏటా పసుపు-కుంకుమ పథకాన్ని తీసుకు వచ్చినట్లు తెలిపారు. 

రైతుల ఖర్చులు తగ్గించేందుకే అన్నదాత-సుఖీభవ, యువతలో భరోసా పెంచేందుకే ముఖ్యమంత్రి యువనేస్తం పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పేదల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ వైద్యసేవ కింద రూ.5 లక్షలు అందజేస్తామని చెప్పారు. అందరికీ సొంతిళ్లు ఇవ్వడం ద్వారా పేదరికంపై గెలుపునకు శ్రీకారం చుట్టామని అన్నారు.

పేదరికం లేని సమాజమే తమ మేనిఫెస్టో లక్ష్యమని అన్నారు. రూ.10 వేల కోట్లతో బీసీ బ్యాంకు, ముస్లింలకు ఇస్లాం బ్యాంకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ ప్రతి నెలా రూ.3వేలు, చంద్రన్న బీమా రూ.10 లక్షలు, విదేశీ విద్యకు రూ.25 లక్షలు కేటాయిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

click me!