టీడీపీలోకి జేడీ లక్ష్మీనారాయణ.. భీమిలి నుంచి బరిలోకి..?

By Siva KodatiFirst Published Mar 12, 2019, 8:36 AM IST
Highlights

లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందని సమాచారం

విశ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారని కొన్నాళ్లు, ఆ తర్వాత జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలోని లోక్‌సత్తా పార్టీని నడిపిస్తారని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది.

కానీ ఆ తర్వాత ఆయన సైలంట్ అయిపోయారు. తాజాగా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందని సమాచారం.

తొలుత ఇక్కడి నుంచి సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్ పోటీ చేయాలని భావించినా, తాజా పరిణామాల నేపథ్యంలో లోకేశ్ విశాఖ నార్త్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అక్రమాస్తులు, గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కేసుల్ని దర్యాప్తు చేసి సంచలనం సృష్టించారు.

ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వోద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నించింది.

మంత్రి గంటా శ్రీనివాసరావుతో లక్ష్మీనారాయణ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగానే జేడీ తెలుగుదేశంలోకి వచ్చేందుకు సానుకూలంగా స్పందించారని, కొద్దిరోజుల్లో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

click me!