వైఎస్ వివేకా హత్యపై బాబు సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 17, 2019, 12:53 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు త్యాగాలకు మారుపేరన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచార సన్నాహక సభలో భాగంగా విజయనగరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు త్యాగాలకు మారుపేరన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచార సన్నాహక సభలో భాగంగా విజయనగరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

రాష్ట్రాన్ని లూటీ చేయడానికి బందీపొట్లు వస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వంద ఓట్లకు సేవామిత్ర, బూత్‌ల వారీగా కమిటీలు, ఎనిమిది నుంచి 10 బూత్‌లకు ఒక ఏరియా కో ఆర్డినేటర్‌ను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు.

అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా నిర్వహించామన్నారు. తెలుగుదేశం పార్టీకి సేవకు మారుపేరని సీఎం తెలిపారు. ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిచెప్పారని, ఆయన పెట్టిన ఈ పార్టీని ఏ శక్తి ఏం చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

పేదరికం లేని ఆరోగ్యకరమైన, ఆనందకరమైన రాష్ట్ర నిర్మాణం దిశగా తాను ప్రణాళికలు చేపడుతున్నానని తెలిపారు. హేతుబద్ధత లేని విభజన వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నామని సీఎం వెల్లడించారు.

రూ.200 పెన్షన్‌ను రూ.2000కు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. రూ.2000 పెన్షన్ వల్ల 55 లక్షల మందికి లబ్ధి చేకూరిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పసుపు-కుంకమ పథకం కింద రెండు విడతలుగా రూ.10 వేలు విడుదల చేశామన్నారు.

అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులను ఆదుకున్నామన్నారు. రాష్ట్రాన్ని సురక్షితంగా గమ్యాన్ని చేర్చడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నానని,తానే నెంబర్‌వన్ డ్రైవర్‌నని సీఎం వ్యాఖ్యానించారు.

5 లక్షల మంది నిరుద్యోగులకు రూ.2000 నిరుద్యోగ భృతిని ఇస్తున్నామన్నారు. ఉద్యోగులకు జీతాలు పెంచడంతో పాటు పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. గ్రామాల్లో 25 వేల కిలోమీటర్ల మేర రహదారులు వేసి టీడీపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు.

పిల్లలకు ఆధునిక విద్యను అందించేందుకు గాను డిజిటల్, వర్చువల్ క్లాస్ రూమ్‌‌లను ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు తీవ్రవాద సమస్య, ముఠా కక్షలు, మత ఘర్షణలు నియంత్రించామన్నారు.

వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య జరిగితే హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించారని, వివేకాను ఇంట్లో దొంగలే హత్య చేశారని సీఎం ఆరోపించారు. హత్య జరిగితే రక్తపు మరకలు ఎవరైనా తుడిచేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

వివేకా హత్యపై సిట్ ఏర్పాటు చేసి, దోషులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించానని సీఎం గుర్తు చేశారు. వివేకా రాసినట్లుగా చెబుతున్న లెటర్ ఉదయం కనిపించకుండా రాత్రి దొరకడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.

స్క్రిప్ట్ ప్రకారమే వైఎస్ వివేకా పీఏ, పనిమనిషి పనిచేశారని ఆరోపించారు. దొంగలకు, అవినీతిపరులకు నరేంద్రమోడీ కాపలా కాస్తున్నారని ఎద్దేవా చేశారు. దొంగతనాలు, లూటీలు, దోపిడీలు చేసేవారంతా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. 

click me!