50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించడానికి ఈసీకి ఇబ్బందేంటీ: బాబు

By Siva KodatiFirst Published Apr 15, 2019, 2:08 PM IST
Highlights

50 శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

50 శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.  సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన బ్యాలెట్ పత్రాలను లెక్కించడంతో పోలిస్తే వీవీప్యాట్‌లను లెక్కించడం సులభమైన పని అన్నారు.

దీనికి ఆరు రోజులు పడుతుందని ఎన్నికల సంఘం చెబుతుందని.. ఈసీ తీరుపై మరోసారి రివ్యూ పిటిషన్ వేస్తామని చంద్రబాబు స్పష్టం చేస్తారు. ఈవీఎంలు హ్యాక్ చేయడానికి వీలుందని చెప్పినందుకు హరిప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టారని సీఎం మండిపడ్డారు.

2009 నుంచి టీడీపీ చేసిన పోరాటానికి ఫలితంగానే వీవీ ప్యాట్‌ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. ఏపీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు పోటీపడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు.

ఈవీఎంలు మొరాయిస్తే ఒంటి గంటకు దానిని రిపేర్ చేశారన్నారు. స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఓటు హక్కు వినియోగించుకున్న పోలింగ్ బూత్‌లోనే ఈవీఎంలు పనిచేయలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఈవీఎంల మొరాయింపుపై తాను ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశానని.. తన పిలుపుతో సాయంత్రం తిరిగి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. భారత దేశ చరిత్రలో తెల్లవారుజాము వరకు జరిగిన ఎన్నికలు ఏపీ ఎన్నికలేనన్నారు.

ఈ స్థాయిలో అవకతవకలు తన రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదన్నారు. చాలా దేశాలు ఈవీఎంలను ఉపసంహరించుకున్నాయని కానీ భారత్‌లో మాత్రం ఇదే విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 

click me!