
అమరావతి: ఈ ఏడాది జనవరి 11వ తేదీ తర్వాత ఏపీ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడ తొలగించలేదని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు.
గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఫారం-7 ధరఖాస్తులు రాగానే ఓట్లు తొలగించరని ఆయన చెప్పారు. ఓట్లు తొలగించారని ఆరోపణలు చేసే వారు రుజువులు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు చేయగానే ఓట్లను తొలగించబోరని ద్వివేది చెప్పారు.
తప్పుడు ధరఖాస్తులపై పోలీసు కేసులు నమోదు చేయగానే ఫారం-7ధరఖాస్తులు ఆగిపోయాయని ఆయన గుర్తు చేశారు.ఓట్ల తొలగింపు వ్యవహరంలో రాజకీయ పార్టీల వైఖరి సరిగా లేదని ఆయన ఆరోపించారు.
ఏపీ రాష్ట్ర జనాభా నిష్పత్తితో పోలిస్తే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓట్లు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కువ మందికి ఓటు లేదనే విషయాన్ని ఆయన చెప్పారు.