45 రోజుల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు మరికొద్దిగంటల్లో తెరపడనుంది. ఎగ్జిట్ పోల్స్‌కు సైతం అందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలల్లో అంతిమ విజేత ఎవరో గురువారం తేలిపోనుంది. కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

09:53 PM (IST) May 23
కృష్ణాజిల్లా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వల్లభనేని వంశీ విజయం సాధించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో వంశీ 820 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
09:49 PM (IST) May 23
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉత్కంఠ నడుమ ఫలితం విడుదలైంది. టీడీపీ అభ్యర్ధి బొండా ఉమపై వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు 15 ఓట్ల తేడాతో గెలుపొందారు.
09:15 PM (IST) May 23
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. జగన్‌కు ఫోన్ చేసిన ఆయన.. తెలుగు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని వెంకయ్య తెలిపారు.
09:11 PM (IST) May 23
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలిపారు. మీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపారమైన విశ్వాసాన్ని చూపారు.. ప్రజలు, రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లాలని ఆశిస్తున్నా... వైఎస్ ఖచ్చితంగా గర్వపడే రోజు ఇది’’ అని ప్రణబ్ ట్వీట్ చేశారు.
09:06 PM (IST) May 23
చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరాజయం పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి విడుదల రజనీ విజయం సాధించారు.
09:04 PM (IST) May 23
అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత కుమారుడు, శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఘన విజయం సాధించారు.
08:55 PM (IST) May 23
కృష్ణాజిల్లా మైలవరంలో మంత్రి దేవినేని ఉమా ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి వసంత వెంకట కృష్ణప్రసాద్ 12,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
08:35 PM (IST) May 23
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారాలోకేశ్ స్పందించారు. ప్రధాని మోడీ, వైఎస్ జగన్‌లకు అభినందనలు తెలిపుతూ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ ఎప్పుడూ ప్రజా పక్షమేనని లోకేశ్ స్పష్టం చేశారు.
08:29 PM (IST) May 23
అన్నింటికి సిద్ధపడే పార్టీ పెట్టానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన జనసైనికులకు, జనసేనకు ఓటు వేసిన ప్రజలకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు.
బలమైన మెజారిటీ సాధించిన వైఎస్ జగన్, ప్రధాని నరేంద్రమోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చివరి శ్వాస విడిచే వరకు రాజకీయాల్లో ఉంటానని పవన్ స్పష్టం చేశారు. ఏ ప్రత్యేక హోదా అయితే వస్తుందని అంతా భావించారో... ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు.
జనసేన ఈ ఎన్నికల్లో కొత్తరకం రాజకీయాలు చేసిందని... ఎక్కడా డబ్బు, మద్యం పంచలేదని పవన్ స్పష్టం చేశారు. తాను ఇచ్చిన మాట మీద నిలబడతానని, రెండు స్ధానాల్లో ఓడినా.. మా వాళ్లు ఒక్క సీటు గెలవకపోయినా.. తుది శ్వాస వరకు ప్రజలకు అండగా ఉంటానని జనసేనాని తెలిపారు.
08:10 PM (IST) May 23
గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
08:00 PM (IST) May 23
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లాలకు జిల్లాలే వైసీపీ ఖాతాలో వచ్చి పడ్డాయి. ముఖ్యంగా కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలోని మొత్తం అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
07:50 PM (IST) May 23
సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు విజయం సాధించారు.
07:49 PM (IST) May 23
నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ 800 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
07:19 PM (IST) May 23
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోడీకి, ఒడిషా ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ పట్నాయక్‌కు బాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
07:08 PM (IST) May 23
ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. ఆమెపై వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రరెడ్డి విజయం సాధించారు.
07:02 PM (IST) May 23
ముఖ్యమంత్రి పదవికి నారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపారు. అనంతరం బాబు రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగాలని చంద్రబాబును గవర్నర్ కోరారు.
06:56 PM (IST) May 23
విశాఖ నార్త్ నుంచి టీడీపీ అభ్యర్ధి, మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు.
06:51 PM (IST) May 23
అనంతపురం జిల్లా హిందూపురంలో సినీనటుడు నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు.
06:50 PM (IST) May 23
గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్నికల ఫలితం ప్రకటన ఆగిపోయింది. బొల్లాపల్లి మండలం గండిగనుమల తండా బూత్‌కి చెందిన ఈవీఎంలలో ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం రావడంతో టీడీపీ అభ్యర్ధి జీవీ ఆంజనేయులు ఆందోళనకు దిగారు.
06:45 PM (IST) May 23
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఫలితం ఉత్కంఠగా మారింది. ఇంకా మరికొన్ని రౌండ్లు లెక్కించాల్సి వుండగా... వైసీపీ అభ్యర్ధి ఆర్కే ఆధిక్యం నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.
06:41 PM (IST) May 23
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 88 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. మరో 60 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
06:39 PM (IST) May 23
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కౌంటింగ్‌కు ఆటంకం ఏర్పడింది. ఇక్కడ 14 ఈవీఎంలు మొరాయించడంతో ఫలితం ఆసక్తిగా మారింది. దీంతో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
06:08 PM (IST) May 23
తన ప్రమాణ స్వీకారం తిరుపతిలో కాదని .. విజయవాడలో అని స్పష్టం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తాడేపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో తనకు ఈ అపూర్వ విజయం దక్కిందన్నారు జగన్. ఈ నెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం జరగుతుందని ఆయన తెలిపారు.
05:34 PM (IST) May 23
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి కిరణ్ కుమార్ విజయం సాధించారు.
05:27 PM (IST) May 23
కృష్ణా జిల్లా గన్నవరం ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ 712 ఓట్ల తేడాతో విజయం సాధించగా, ఇంకా 3 ఈవీఎంలు, 400 పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాల్సి రావడంతో ఇరు పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది.
05:09 PM (IST) May 23
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరో షాక్ తగిలింది. భీమవరంలో ఆయన ఓటమి పాలయ్యారు. పవన్‌పై వైసీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాసరావు 3,900 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
04:42 PM (IST) May 23
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ తగిలింది. విశాఖ జిల్లా గాజువాకలో పవన్ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి గెలుపొందారు. పవన్‌కు 30,905 ఓట్లు రాగా.. నాగిరెడ్డికి 34,712 ఓట్లు లభించాయి.
04:39 PM (IST) May 23
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విజయం సాధించారు.
04:34 PM (IST) May 23
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో టీడీపీ అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్ ఓటమి పాలయ్యారు
04:27 PM (IST) May 23
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి సతీశ్ రెడ్డిపై 91 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
04:15 PM (IST) May 23
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ తో గెలుపొందిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.
04:13 PM (IST) May 23
అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయం పాలవ్వడంతో ఉండవల్లిలోని టీడీపీ అధినేత నివాసం వెలవెలబోతోంది. ఓటమి భారంతో నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా వెనుదిరుగుతున్నారు.
04:01 PM (IST) May 23
కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాగా, జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
03:56 PM (IST) May 23
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైసీపీ అభ్యర్ధి మేకతోటి సుచరిత విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్ధి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను ఓడించారు.
03:52 PM (IST) May 23
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
03:49 PM (IST) May 23
ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ అభ్యర్ధి కరణం బలరామ కృష్ణమూర్తి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి ఆమంచి కృష్ణమోహన్‌పై 12,600 ఓట్ల తేడాతో గెలుపొందారు.
03:47 PM (IST) May 23
జనసేన పార్టీకి ఎట్టకేలకు విజయం దక్కింది. రాజోలులో జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద్ 3400 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
03:44 PM (IST) May 23
హోంమంత్రి, టీడీపీ అభ్యర్ధి చినరాజప్ప పెద్దాపురంలో విజయం సాధించారు. ఆయనకు 3200 ఓట్ల మెజారిటీ వచ్చింది.
03:43 PM (IST) May 23
కృష్ణాజిల్లా అవనిగడ్డలో వైసీపీ అభ్యర్ధి సింహాద్రి రమేశ్ బాబు భారీ మెజారిటీతో విజయం సాధించారు.
03:30 PM (IST) May 23
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. ఆయనకు 33,700 ఓట్ల మెజార్టీ వచ్చింది.