తొలి విడత పోలింగ్: మోడీ టార్గెట్ చంద్రబాబు

By telugu teamFirst Published Mar 11, 2019, 12:53 PM IST
Highlights

కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాని నరేంద్ర మోడీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఏదో మేరకు పాగా వేయడం అవనసరం. బిజెపి కాకున్నా తన మిత్రులైనా దక్షిణాది రాష్ట్రాల్లోని లోకసభ స్థానాల్లో పాగా వేయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, ఆంధ్రప్రదేశ్ లోని లోకసభ స్థానాలకు తొలి విడత పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. పార్టీల వ్యూహాలకూ ప్రతివ్యూహాలకూ కేవలం 30 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సవాల్ గా మారే పరిస్థితి కల్పిస్తోంది. 

కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాని నరేంద్ర మోడీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఏదో మేరకు పాగా వేయడం అవనసరం. బిజెపి కాకున్నా తన మిత్రులైనా దక్షిణాది రాష్ట్రాల్లోని లోకసభ స్థానాల్లో పాగా వేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాలు ఉండగా, తెలంగాణలో 17 స్థానాలున్నాయి.  ఈ సీట్లలో ఏదో మేరకు వైఎస్సార్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకసభ స్థానాలను గెలుచుకోవడం మోడీకి అవసరమని భావిస్తున్నారు. 

ప్రత్యేక హోదా ఇచ్చే వారికే కేంద్రంలో మద్దతు ఇస్తామని వైఎస్ జగన్ చెబుతున్నప్పటికీ ఆయన బిజెపికి దగ్గరగా ఉన్నారనే అభిప్రాయమే బలంగా నెలకొని ఉంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని భావిస్తున్నారు. కేసీఆర్ కూడా బిజెపికి సన్నిహితంగా ఉన్నారనే భావనే బలంగా ఉంది. 

ఈ స్థితిలో మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి తొలి విడత పోలింగ్ పనికి వస్తుందని భావిస్తున్నారు. ఆయనతో పాటు బిజెపి జాతీయాధ్యక్షుడు, ఇతర జాతీయ నేతలు రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా వారు పెద్ద యెత్తున ప్రచారం సాగించే అవకాశాలున్నాయి. తొలి విడత పోలింగ్ వల్ల ఈ అవకాశం వారికి చిక్కుతున్నట్లు చెబుతున్నారు. 

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి బిజెపి పనిచేసింది. దీనివల్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందనే అభిప్రాయం ఉంది. ఈసారి తాము ఒంటరిగా పోటీ చేయడం వల్ల గత ఎన్నికల్లో టీడీపికి పడిన తమ ఓట్లను తాము పొందగలిగితే వైసిపి లాభపడవచ్చుననే అంచనా ఉంది. దీంతో సాధ్యమైనంత మేరకు టీడీపి ఓట్లకు గండికొట్టే ఎత్తుగడలో బిజెపి ఉన్నట్లు చెబుతున్నారు.

- కె. నిశాంత్

click me!