
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల గల్లంతుపై తీవ్ర వివాదం రేగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అదే విధంగా ఏపిలో కూడా అధికార అండతో టిడిపి పార్టీ భారీలో ఓట్ల తొలగింపుకు పాల్పడుతోందంటూ ఇటీవలే వైఎస్సార్‌సిపి అధినేత జగన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయినా ఓటర్ల జాబితాలో ఇంకా అవకతవకలు కొనసాగుతూనే వున్నాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
తాజాగా వారి ఆరోపణలను నిజం చేసే ఓ వ్యవహరం బయటపడింది. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైఎస్సార్‌సిపి అధినేత జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి ఓటునే గల్లంతు చేయడానికి కుట్రలు జరిగినట్లు వైఎస్సార్‌సిపి ఆరోపిస్తోంది. ఆయన ఓటు హక్కును తొలగించాలంటూ ఈసీ అధికారులకు ఆన్ లైన్ లో వినతి పత్రం అందింది. అయితే ఈ దరఖాస్తు గురించి అసలు వివేకానంద రెడ్డికే తెలియనట్లు వైఎస్సార్‌సిపి నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం కావాలనే ఆయన ఓటును తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్లు వైఎస్సార్‌సిపి ఆరోపిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా ఓట్లను అధికార పార్టీ ఇదేవిధంగా మాయం చేసినట్లు వైఎస్సార్‌సిపి నాయకులు పేర్కొంటున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరింతగా రెచ్చిపోతూ ఏకంగా మాజీ మంత్రి ఓటుకే ఎసరు పెట్టారని అంటున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్పట్లు వైఎస్సార్‌సిపి నాయకులు ప్రకటించారు.