50లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చారు, జగన్ ది అదే ప్లాన్: టీఆర్ఎస్ పై ఏపీ మంత్రులు ఫైర్

By Nagaraju penumalaFirst Published Mar 5, 2019, 8:15 PM IST
Highlights

వైసీపీ క్రిమినల్‌ ఆలోచనలు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ 50 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చిందన్నారు. జగన్ సిగ్గు లేకుండా ఫారం-7ను అప్లయ్‌ చేశారని చెప్పుకొచ్చారు. డేటా చోరీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి కేసు పెట్టే అధికారం లేదన్న ఆయన దొంగే దొంగ అన్నట్లుగా వైసీపీ తీరు ఉందన్నారు.

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ అంశం అగ్గి రాజేస్తోంది. డేటా చోరీ తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంటే...తమ డేటాను టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల సాయంతో చోరీ చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై ఏపీ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఏపీ ప్రభుత్వ, ప్రజల డేటా భద్రంగా ఉందని  మంత్రులు స్పష్టం చేశారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఇప్పటి వరకు 100 కేసులు నమోదు అయ్యాయని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. 

రాజకీయాల్లో కొత్త పోకడ చూస్తున్నామని మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. వైసీపీయే ఫోటోల తొలగింపుకు కుట్ర పన్నుతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి, జగన్‌లే ముద్దాయిలుగా మిగులుతారని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 

వైసీపీ క్రిమినల్‌ ఆలోచనలు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ 50 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చిందన్నారు. జగన్ సిగ్గు లేకుండా ఫారం-7ను అప్లయ్‌ చేశారని చెప్పుకొచ్చారు. డేటా చోరీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి కేసు పెట్టే అధికారం లేదన్న ఆయన దొంగే దొంగ అన్నట్లుగా వైసీపీ తీరు ఉందన్నారు. 

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు భయపడి జగన్‌ అడ్డదారులు తొక్కుతున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. ప్లాన్ ప్రకారం ఓట్లు తొలగిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అడ్డదారులు తొక్కుతోందనడానికి ఈ వ్యహారమే నిదర్శనమన్నారు. ఏపీ ప్రజల ఆధార్‌ డేటా భద్రంగా ఉందని ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

click me!