
అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ మంత్రి కళా వెంకట్రావు విమర్శలు దాడికి దిగారు. మోదీ దొంగల ముఠాకు సంరక్షకుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రధాని మోదీకి మంత్రి కళా వెంకట్రావ్ బహిరంగలేఖ రాశారు.
ప్రధాని రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. సభలు పెట్టి అసత్యాలు చెప్తే ప్రజలు నమ్ముతారా అంటూ నిలదీశారు. ఏపీలో వైఎస్ జగన్ తో మోదీ లాలూచీ పడ్డారంటూ ఆరోపించారు.
జగన్ ఆస్తుల కేసులను మొదటి నుంచి విచారించాలనడం లాలూచీ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆర్థిక నేరగాళ్లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నది నిజం కాదా అని మంత్రి కళా వెంకట్రావు లేఖలో ప్రశ్నించారు.
మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ మార్చి 1న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖపట్నం బహిరంగ సభలో ఏపీకి కేంద్రం ప్రభుత్వం చేసిన సహాయం, విశాఖ రైల్వే జోన్ పై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీకి మంత్రి కళా వెంకట్రావ్ బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.