తిరుమల శ్రీవారి ఆలయం డ్రోన్‌ వీడియో: సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిని గుర్తించామన్న వైవీ సుబ్బారెడ్డి

By Sumanth KanukulaFirst Published Jan 21, 2023, 11:48 AM IST
Highlights

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయానికి సంబంధించినది చెబుతున్న డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయానికి సంబంధించినది చెబుతున్న డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటనలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సీరియస్‌గా తీసుకుంది. తాజాగా ఈ ఘటనపై స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఆనంద నిలయ గోపరంపై ఫొటోగ్రఫీకి అనుమతి లేదని అన్నారు. ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న విజువల్స్‌పై విచారణ జరుపుతున్నామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తున్నారా? అనే దిశగా కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి విజువల్స్ అప్‌లోడ్ చేసినట్టుగా గుర్తించామని వెల్లడించారు.

ఆ వీడియోను కావాలని డ్రోన్‌లో చిత్రీకరించిన మాదిరిగా క్రియేట్ చేశారా? లేదా వాస్తవంగా ఎవరికి తెలియకుండా చాటుమాటుగా చిత్రీకరించారా? అనేది తెలియడానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించమని చెప్పడం జరిగిందన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అన్నారు. రెండు రోజుల్లో వాస్తవాలను భక్తుల మందు ఉంచుతామని తెలిపారు. 

Latest Videos

ఇదిలా ఉంటే.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తాం టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ తెలిపారు. శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియో వాస్తవం కాదని చెప్పారు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని.. అలాంటింది శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం అసాధ్యం అని అన్నారు. సదరు వీడియోను పరిశీలించిన అనంతరం ఇందుకు కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదిలా ఉంటే.. తిరుమల ఆలయానికి సంబంధించిన డ్రోన్ వీడియో వైరల్‌గా మారడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ వీడియో నిజమైనదేనా..?, వీడియో నిజమైనదే అయితే.. తిరుమలలో డ్రోన్‌ వినియోగం ఎలా సాధ్యపడింది?, వీడియో ఎవరు తీశారు?.. వంటి ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. 

click me!