
ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) టీడీపీ నేత (tdp) పట్టాభిరామ్ (kommareddy pattabhi) చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలోని టీడీపీ ఆఫీసులపై మంగళవారం సాయంత్రం వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. విజయవాడలోని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై దాడిచేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి ఆవరణలోని కారు, ద్విచక్రవాహనం, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది ఒక్కసారిగా ఇంటిపై దాడికి దిగారని పట్టాభి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టాభి దొరికితే చంపేస్తామంటూ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారని తెలిపారు.
అటు వైసీపీ మద్దతుదారులు అని చెబుతున్న కొందరు మహిళా కార్యకర్తలు విశాఖలోని టీడీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. హిందూపురంలో సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (nandamuri balakrishna) ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వైసీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. టీడీపీ నేత లింగారెడ్డి (linga reddy) ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు.
"
మరోవైపు టీడీపీ నేత పట్టాభిరామ్ సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ తిరుపతి నగరంలోని గాంధీ కూడలి వద్ద చంద్రబాబు దిష్టి బొమ్మను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశాయి. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో గంజాయి అక్రమ రవాణా చేసేది టీడీపీ నాయకులే అని అందరికీ తెలుసన్నారు.
"
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంటలో టీడీపీ నేతల ర్యాలీపై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. టీడీపీ కార్యాలయాలపై దాడిని నిరసిస్తూ బొజ్జల సుధీర్‌రెడ్డి (bojjala sudheer reddy), తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నరసింహయాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ గురించి తెలుసుకున్న రేణిగుంట సర్పంచి నగేశ్, ఉప సర్పంచి సుజాత, వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. టీడీపీ నేతలపై చెప్పులు, చీపుర్లతో వైసీపీ నేతలు దాడి చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి. అనంతరం ర్యాలీ ముగించుకుని టీడీపీ నేతలు తిరిగి వెళ్తున్న సమయంలో సుధీర్‌రెడ్డి, నరసింహయాదవ్, టీడీపీ నేతల వాహనాలపై వైసీపీ శ్రేణులు మరోసారి రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
"