దొంగ నోట్ల చలామణి కేసులో వైసీపీ మహిళా నాయకురాలు రజని.. బెంగళూరులో అరెస్ట్..

By Sumanth KanukulaFirst Published Jan 25, 2023, 11:29 AM IST
Highlights

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు  చెందిన వైసీపీ మహిళా నాయకురాలు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టరుగా ఉన్న రసపుత్ర రజిని దొంగ నోట్ల వ్యవహారంలో చిక్కుకున్నారు. 

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు  చెందిన వైసీపీ మహిళా నాయకురాలు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టరుగా ఉన్న రసపుత్ర రజిని దొంగ నోట్ల వ్యవహారంలో చిక్కుకున్నారు. దొంగ నోట్ల చలామణికి సంబంధించి రజినిని బెంగళూరులోని సుబ్రమణ్యపుర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు  చరణ్ సింగ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి  రూ. 500 ముఖ విలువ గల పెద్ద మొత్తంలో నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. అనంతపురంలో తమకు పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి ఈ నోట్లను తక్కువకు కొనుగోలు చేసి బెంగళూరులో చలామణిలోకి తీసుకొస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇక, ప్రొద్దుటూరు వైసీపీలో రజిని  కీలక నాయకురాలుగా ఉన్నారు. ఆమె ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరగణంలో ఒక్కరిగా ఉన్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అండదండలతోనే ఆమెకు బొందిలి కార్పొరేషన్‌ డైరెక్ట పదవి దక్కినట్టుగా ప్రచారం ఉంది. 

ఇదిలా ఉంటే.. దొంగ నోట్ల చలామణి కేసులో రజిని అరెస్ట్ కావడంతో అధికార వైసీపీపై టీడీపీ విమర్శలు గుప్పించింది. టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దొంగ నోట్లతో పట్టుబడిన రజనీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శిష్యురాలని.. ఆయనకు కూడా ఈ దొంగ నోట్లతో సంబంధం పైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రజని గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ప్రొద్దుటూరులో పేద, మధ్య తగరతి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 

click me!