బీజేపీతో పొత్తుపై తేల్చేసిన వైసీపీ

By Nagaraju TFirst Published Nov 28, 2018, 2:41 PM IST
Highlights

 బీజేపీతో పొత్తుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కడపలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి పార్టీని పటిష్ట పరిచేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నామని అందులో భాగంగా కడపకు వచ్చినట్లు తెలిపారు. 


 కడప: బీజేపీతో పొత్తుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కడపలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి పార్టీని పటిష్ట పరిచేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నామని అందులో భాగంగా కడపకు వచ్చినట్లు తెలిపారు. 

రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. రాయలసీమపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే ఇప్పటికే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటై ఉండేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎత్తులు జిత్తులు వేస్తూ కాలయాపన చేస్తున్నారని తెలిపారు.
 
వైఎస్‌ జగన్‌ సీఎం అయిన వెంటనే తప్పనిసరిగా ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతామన్నారు. ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట సభ అధర్మ పోరాటంగా అభివర్ణించారు. టీటీడీ నిధులను సైతం దుర్వినియోగం చేసిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. రెవెన్యూ, కలెక్టర్లు, పోలీసులు అంతా టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

ప్రజలు దీవిస్తే తాము అధికారంలోకి వస్తామని అప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో 670 మండలాలు ఉంటే వాటిలో సగానికి పైగా మండలాల్లో కరువు ఉందని ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. 

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై చురకలు వేశారు విజయసాయిరెడ్డి. మీటింగ్స్‌లో సినిమా డైలాగ్‌లు కొట్టడం సరికాదని, ప్రజల్లో ఉంటే తెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఒత్తిడితో సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్న తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులను విడిచిపెట్టమని స్పష్టం చేశారు.

click me!