రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
విశాఖపట్టణం: రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.బుధవారం నాడు స్టీల్ ప్లాంట్ టీడీఐ జంక్షన్ వద్ద ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ విషయమై జగన్ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలనే నిర్ణయం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీపరం కాకుండా ఎలా కాపాడుకోవాలనేది ఇప్పుడు మన ముందున్న కర్తవ్యమన్నారు.
కమ్యూనిష్టులతో కలిసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ భూముల్ని దోచుకోవడానికి ప్రైవేటీకరణను సమర్ధిస్తున్నామని మా మీద ప్రత్యర్ధులు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.