
ఏపీలో ఏప్రిల్ 4 నుంచి 26 జిల్లాల పాలన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం జగన్ లాంఛనంగా కొత్త జిల్లాలను ప్రారంభించారు. అయితే, జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) స్పందించారు.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అత్యంత శాస్త్రీయంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. 26 జిల్లాలు ఒక్కో ఆణిముత్యంలా అభివృద్ధిని నమోదు చేస్తాయని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. నాలుగు జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి, అన్నమయ్య, శ్రీసత్యసాయి పేరిట నామకరణం చేయడం ద్వారా సీఎం జగన్ వారిని చిరస్మరణీయులుగా చేశారని విజయసాయి ప్రశంసించారు. కొత్త జిల్లాలపై ఎవరెంత ఏడ్చినా ఐదున్నర కోట్ల మంది ప్రజలు స్వాగతించారని ఆయన గుర్తుచేశారు.
ఇకపోతే.. తెలుగుదేశం పార్టీ (TDP) ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సోమవారం సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నూతన జిల్లాల (new districts) ఏర్పాటుపై చంద్రబాబు మాట్లాడుతూ... కేవలం రాజకీయ కోణంలో ఆలోచించి కొత్త జిల్లాలను అశాస్త్రీయంగా ఏర్పాటుచేసారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి రాగానే శాస్త్రీయ పద్దతిలో జిల్లాలను సరిదిద్దుతామని తెలిపారు.
ఇక కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బాద్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజలపక్షాన నిలబడి పోరాడుతామన్నారు. కరెంట్ చార్జీల మోత, పన్నుల భారంపై ''బాదుడే బాదుడు'' పేరుతో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తామన్నారు. కరెంట్ ఎందుకు పోతోందో... బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలన్నారు. కేవలం తన వ్యక్తిగత ఆదాయం కోసమే సీఎం జగన్ యావత్ రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
''అమరావతి (amaravati)లో 80 శాతం పూర్తి అయిన పనులను కూడా పూర్తి చెయ్యలేని జగన్ ఇప్పుడు మరో 5 ఏళ్లు అధికారాన్ని అప్పగించాలని కోరుతున్నాడు. జగన్ పాలనపై చివరికి ఆయన సొంత సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదు. వ్యక్తిగత అవసరాల కోసమే పదవులు ఇస్తున్నారు. సామాజిక సమతూకం పాటించకుండా పదవులు, పోస్టింగ్ లు ఇస్తున్న విధానంపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది'' అన్నారు. ''జగన్ ప్రభుత్వ విధానాల కారణంగా రెడ్డి సామాజికవర్గంలో ఉన్న రైతులు, వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పక్షాన నిలిచి ఓటేసినందుకు బాధపడుతున్నారు. జగన్ కు ఓటేసి అధికారాన్ని కట్టబెట్టి తప్పు చేశామనే భావన ఇప్పుడు సొంత వర్గంలోనే ఉంది'' అని చంద్రబాబు అన్నారు.