
లోకేశ్ నా మాటలను వక్రీకరించారని అన్నారు వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరీ. స్టీల్ ప్లాంట్‌పై సీఎంను అడిగి మాట్లాడతానంటే అందులో తప్పేముందని ఎంపీ ప్రశ్నించారు. ఎవరో ఏదో రాసిస్తే మాట్లాడి నవ్వులపాలు కావొద్దని బాలశౌరి హితవు పలికారు.
లోకేశ్ విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ అతి చేస్తే లీగల్ చర్యలు తప్పవని వైసీపీ ఎంపీ హెచ్చరించారు. కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఆలోచిద్దామని వల్లభనేని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఊహాగానాలు వద్దన్నారు. అంతకుముందు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై లోకేష్ స్పందించారు. సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు.
Also Read:విజయసాయి అల్లుడికి వరకట్నంగా పోర్టు...ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్..: లోకేష్ ఆందోళన
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని లేఖలో కోరారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో వైసీపీ ఎంపీలు విఫలమయ్యారని లోకేష్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కనీస కేటాయింపులు సాధించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని లోకేష్ అన్నారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు. 32 మంది ప్రాణ త్యాగాలతో సాకారం అయిన స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు.