వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ రిలీఫ్.. బెయిల్ పొడిగించిన హైకోర్ట్

By Siva KodatiFirst Published Aug 23, 2022, 9:42 PM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఊరట లభించింది. ఆయన బెయిల్‌ను సెప్టెంబర్ 5 వరకు పొడిగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అనంతబాబు రెగ్యులర్‌ బెయిల్‌కు సంబంధించి బుధవారం రాజమండ్రి కోర్ట్ విచారణ జరపనుంది. 

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు సెప్టెంబర్ 5 వరకు బెయిల్ పొడిగిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతబాబు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మూడు రోజులు బెయిల్ మంజూరు చేసింది రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్ట్. అయితే రాజమండ్రి కోర్ట్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు అనంతబాబు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్‌ను మరో 11 రోజులు అదనంగా పొడిగించింది. మరోవైపు అనంతబాబు రెగ్యులర్‌ బెయిల్‌కు సంబంధించి బుధవారం రాజమండ్రి కోర్ట్ విచారణ జరపనుంది. 

ఇకపోతే.. ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రిలోని ఎస్సీ,ఎస్టీ కోర్ట్ సోమవారం మూడు రోజుల బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం అనారోగ్యం కారణంగా అనంతబాబు తల్లి మంగారత్నం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఎల్లవరం గ్రామంలో తల్లి అంత్యక్రియలకు హాజరుకానున్నారు అనంతబాబు. రూ.25 వేలు, ఇద్దరు పూచీకత్తుపై కోర్ట్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 

అయితే ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ కండిషన్స్ పెట్టింది కోర్ట్. 25 మధ్యాహ్నం 2 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాలని ఆదేశించింది. స్వగ్రామం ఎల్లవరం దాటి బయటకు రాకూడదని, అనంతబాబుతో అనునిత్యం పోలీసులు వుండాలని న్యాయస్థానం సూచించింది. అలాగే కేసు విషయంపై ఎక్కడా ప్రస్తావించకూడదని కోర్ట్ ఆదేశించింది. అంత్యక్రియలకు మాత్రమే బయటకు వెళ్లాలని సూచించింది. 

Also REad:వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్... కండీషన్స్ అప్లయ్

ఇదిలావుంటే.. ఈ ఏడాది మే 20వ తేదీన ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్ గా పనిచేసి మానేసిన సుబ్రమణ్యం హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఎమ్మెల్సీ అనంతబాబు కారణమని పోలీసులు తేల్చారు.  సుబ్రమణ్యాన్ని పద్దతి మార్చుకోవాలని మందలించే క్రమంలో  చేయి చేసకోవడంతో అతను కింద పడి తలకు గాయం కావడంతో మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. అయితే ఈ కేసులో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు.

ఈ కేసులో అరెస్టైన అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. బెయిల్ మంజూరు చేయాలని ఆయన గతంలో కోర్టుల్లో బెయిల్ పిటిసన్లు దాఖలు చేశారు. అయితే అనంతబాబు బెయిల్ పిటిషన్లను కోర్టులు పలుమార్లు కొట్టివేశాయి. ఇదిలా ఉంటే  ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. 90 రోజుల్లోపుగా చార్జీషీట్ దాఖలు చేయకపోతే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. 

మరోవైపు.. డ్రైవర్ సుబ్రమణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది.  వైద్య ఆరోగ్య శాఖలో అపర్ణకు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం.ఈ మేరకు కలెక్టర్ కృతికా శుక్లా ఈ ఏడాది జూన్ చివర్లో ఉత్తర్వు పత్రాలను అందించారు. 
 

click me!