ఆ రోజు నన్ను అందుకే సస్పెండ్ చేశారు: గుర్తు చేసిన రోజా

By narsimha lodeFirst Published Jun 13, 2019, 4:38 PM IST
Highlights

 కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌ గురించి టీడీపీ ప్రభుత్వ హయంలో  మహిళలపై జరిగిన  అకృత్యాలను ప్రశ్నించినందుకే తనపై ఏడాది పాటు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ వేటు వేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.

అమరావతి: కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌ గురించి టీడీపీ ప్రభుత్వ హయంలో  మహిళలపై జరిగిన  అకృత్యాలను ప్రశ్నించినందుకే తనపై ఏడాది పాటు అసెంబ్లీ నుండి సస్పెన్షన్ వేటు వేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అలాంటి టీడీపీ నేతలు ఇవాళ సభలో సంపద్రాయాల గురించి మాట్లాడడాన్ని ఆమె ఎద్దేవా చేశారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ను ఎన్నికైన తర్వాత ఆయనను అభినందిస్తూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రసంగించారు. ఏడాది పాటు తనను గత అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని తాను సుప్రీంకోర్టులో సవాల్ చేసినట్టుగా ఆమె గుర్తు చేశారు. సుప్రీంకోర్టు కూడ తనకు మద్దతుగా తీర్పు ఇచ్చిందన్నారు. కానీ, ఈ తీర్పును  కూడ అమలు చేయలేదన్నారు. కనీసం తనను సభలోకి కూడ అడుగుపెట్టకుండా మార్షల్స్‌తో బయటకు గెంటించారని ఆమె గుర్తు చేశారు.

ఇలాంటి నేతలు సంప్రదాయాల గురించి మాట్లాడుతారా అని ఆమె ప్రశ్నించారు. శాసనసభలో  సంప్రదాయాలు పాటించడం లేదని టీడీపీ నేతలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమేనని రోజా విరుచుకుపడ్డారు.

స్పీకర్‌ను అవమానించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు.కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్‌గా ఎన్నికైన సమయంలో కూడ చంద్రబాబు ఇలానే అవమానించాడని..,. ఇవాళ కూడ మిమ్మల్ని అవమానించారన్నారు. స్పీకర్ చైర్‌ను కూడ దుర్వినియోగం చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతోందన్నారు.

బీసీ సామాజిక వర్గం నుండి స్పీకర్‌గా ఎన్నికైనందుకు మిమ్మల్ని చూస్తే అచ్చెన్నాయుడుకు కడుపు మండుతోందని రోజా సెటైర్లు వేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వ హయంలో  చోటు చేసుకొన్న ఘటనలను ప్రస్తావిస్తే ఎన్ని వేల గుంజీలను టీడీపీ ఎమ్మెల్యేలు తీయాల్సి వస్తోందన్నారు.

ఎన్టీఆర్‌ను సభలో కనీసం మాట్లాడకుండా యనమల రామకృష్ణుడు ద్వారా చేయించారని ఆమె విమర్శించారు. ప్రతిపక్షంలో కూర్చొన్న రెండు రోజులకే టీడీపీ నేతల్లో అసహనం పెరిగిపోయిందని రోజా వ్యాఖ్యానించారు.

 

click me!