
వైసీపీ సీనియర్ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్వల్పంగా గాయపడ్డారు. మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణంలో పర్యటించిన నాని.. ప్రజలతో ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్లోకి వెళ్లిన నాని.. అక్కడి మంచంపై కూర్చోబోయారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కాలు మంచం కోడుకు బలంగా తగలడంతో మోకాలికి గాయమైంది. దీంతో కొడాలి నాని నడిచేందుకు కాస్తంత ఇబ్బందిపడ్డారు.
అంతకుముందు కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అస్తమించిన వ్యవస్థ అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ డిఫాల్డర్లు నోటికొచ్చినట్లు వాగుతున్నారని.. లోకేష్‌కు పార్టీని అప్పజెప్పడానికి పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిస్తున్నారని నాని ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నేతలు చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్.. విశాఖలోనూ జరుగుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ నగరంపై టీడీపీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విష ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.
ALso REad:మళ్లీ ఆ పరిస్ధితి తేవొద్దు : అమరావతి రైతుల పాదయాత్రపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
రూ.30 లక్షలు వున్న అమరావతి భూములు రూ.10 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. విశాఖ దసపల్లా భూముల్లో టీడీపీ కార్యాలయంతో పాటు చంద్రబాబు మనుషులకు చెందిన ఆఫీసులు వున్నాయని కొడాలి నాని పేర్కొన్నారు. రిషికొండ ప్రభుత్వ ఆస్తి అని .. అలాంటి చోట కార్యాలయాలు కడుతుంటే దోపిడీ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.