జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియాలని, టీడీపీని పవన్ కల్యాణ్ టేకోవర్ చేస్తున్నారా అని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ తీరు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. టీడీపీ బలహీనపడిందని పవనే చెబుతున్నారని సజ్జల చురకలంటించారు. ఎన్డీయే కూటమి నుంచి బయటకొచ్చినట్లు పవన్ చెప్పారని రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ బలహీనపడింది కాబట్టి.. ఆ పార్టీకి యువరక్తం ఎక్కించేందుకు ఎన్డీయే నుంచి బయటకు వచ్చానని పవన్ చెప్పారని సజ్జల దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ అసలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో తేలాలని.. అసలు టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియాలని ఆయన ప్రశ్నించారు. టీడీపీని పవన్ కల్యాణ్ టేకోవర్ చేస్తున్నారా అని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఎప్పుడూ తప్పుడు ప్రచారమే చేస్తోందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును జైల్లో పెట్టింది జగన్ కాదు కోర్టు అని రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి చంద్రబాబు కేసులతో సంబంధం లేదన్నారు. ప్రాథమిక ఆధారాలతో చంద్రబాబును కోర్టు జైల్లో పెట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని సజ్జల తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులను జగనే ఎక్కువ తెచ్చారని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అన్ని ఆధారాలు వున్నాయని.. చంద్రబాబు ఖాతాలోకే స్కాం డబ్బులు వెళ్లినట్లు సీఐడీ చెప్పిందని సజ్జల తెలిపారు.
స్కిల్ స్కాంలో లోకేశ్ సన్నిహితుడు కిలారి రాజేశ్ పాత్ర కీలకంగా వుందన్నారు. అన్ని తప్పులూ వారే చేసి సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు స్కాం గురించి టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దిగజారి మాట్లాడుతున్నారని సజ్జల ఫైర్ అయ్యారు. జడ్జీలను , న్యాయవాదులను ఇష్టానుసారం దూషిస్తున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. వారి ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్‌కు చేరిందన్నారు.