చంద్రబాబుకు రిమాండ్.. ఇది చిన్న కేసే , ఇంకా బోలెడు, వాటిలోనూ శిక్ష తప్పదు : సజ్జల

By Siva KodatiFirst Published Sep 10, 2023, 7:32 PM IST
Highlights

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ సూత్రధారి , పాత్రధారి చంద్రబాబు నాయుడే అన్నారు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం చిన్నది మాత్రమేనని.. ఇంకా చాలా కేసులు వున్నాయన్నారు సజ్జల.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ సూత్రధారి , పాత్రధారి చంద్రబాబు నాయుడే అన్నారు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిన్నర క్రితం ఈ కేసు దర్యాప్తు మొదలైందన్నారు. తీగ లాగితే అసలు డొంక కదలిందని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ కేసులో చంద్రబాబును పోలీసులు నిన్న అరెస్ట్ చేశారని.. ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయన్నారు. నిన్నటి నుంచి శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 

చంద్రబాబు, లోకేశ్ వ్యవహారాన్ని ప్రజలంతా చూశారని.. నిన్నటి నుంచి నారా, నందమూరి కుటుంబం లెక్కలేని విధంగా ప్రవర్తించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందని సజ్జల పేర్కొన్నారు. అన్ని అధారాలతో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. 40 ఏళ్లుగా చంద్రబాబు జీవితమంతా అవినీతిమయమని.. చంద్రబాబు తరపున దత్తపుత్రుడు కూడా హడావుడి చేశాడని సజ్జల మండిపడ్డారు. నిన్న లోకేష్ బూతు పురాణం ప్రజలంతా విన్నారని రామకృష్ణా రెడ్డి దుయ్యబట్టారు. 

Also Read: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం .. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్

చేసిన నేరాలకు తలదించుకోవాల్సిందిపోయి.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. హెలికాఫ్టర్‌లో వస్తే గంటలో విజయవాడ వచ్చే వారని సాయంత్రానికి ప్రక్రియ ముగిసేదని సజ్జల చెప్పారు. 40 ఏళ్లుగా చంద్రబాబు ఎన్నో స్కామ్‌లు చేశారని పేర్కొన్నారు. తప్పు చేయకుంటే రూ.కోటి ఇచ్చి లాయర్‌ను ఎందుకు తెచ్చుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. అరెస్ట్ చేస్తే ఒక డ్రామా.. చేయలేదు అంటే ఇంకో డ్రామా అని సజ్జల ధ్వజమెత్తారు. ప్రతీ విషయంలో పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం చిన్నది మాత్రమేనని.. ఇంకా చాలా కేసులు వున్నాయన్నారు సజ్జల. అమరావతి ల్యాండ్ స్కాం, అసైన్డ్ భూములు, రింగ్ రోడ్డు, సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో అవినీతి వంటి కేసుల్లో ఆధారాలు సేకరిస్తున్నామన్నారు.


 

click me!