దోచుకోవడానికే స్కీమ్ .. రూపాయి రాలేదని సీమెన్స్ చెప్పింది, పక్కా ఆధారాలతోనే అరెస్ట్ : సజ్జల

By Siva KodatiFirst Published Sep 13, 2023, 5:27 PM IST
Highlights

చంద్రబాబు జైలులో వుండటమే తప్పయినట్లుగా మాట్లాడుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు . హౌస్ కస్టడీలో వుంచితే దానిని అరెస్ట్ అంటారా.. ఇంట్లో వుంచేదానికి అరెస్ట్ చేయడం ఎందుకు అని సజ్జల ప్రశ్నించారు. 

టీడీపీ, ఎల్లో మీడియాలు వ్యవస్థలను మేనేజ్ చేయగలవన్నారు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు విషయం పక్కనబెట్టి ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును హింసిస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల ఫైర్ అయ్యారు. కుట్రతో రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు నష్టం కలిగించారని ఆయన ఆరోపించారు. 

పక్కా ఆధారాలతో సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిందని.. నేషనల్ ఏజెన్సీలు కూడా దోపిడి జరిగిందని నివేదికలు ఇచ్చాయని సజ్జల తెలిపారు. దొంగను అరెస్ట్ చేస్తే.. మానవహక్కులకు భంగం కలిగించారంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కోర్టు కూడా ఏకీభవించాక ఈ హడావుడి ఎందుకు అని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. సీమెన్స్ ప్రతినిధులు మాకు సంబంధం లేదని చెబుతున్నారని తెలిపారు. టీడీపీ హడావుడితో అసలు విషయం పక్కకుపోతోందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ నేతల దబాయింపులకు తాము సమాధానం ఇవ్వాల్సి వస్తోందని రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. స్కిల్ స్కాంతో ఖజానాకు నేరుగా నష్టం కలిగించారని ఫైర్ అయ్యారు. ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని సీమెన్స్ చెబుతోందని.. అలాగే ఎలాంటి డబ్బులు రాలేదని తెలిపిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈడీ కూడా హవాలాపై దర్యాప్తు చేసిందని ఆయన తెలిపారు. 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదని సీమెన్స్ స్పష్టం చేసిందని సజ్జల పేర్కొన్నారు. 

టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశారని.. దేశంలో వుండే చట్టాలకు ఆయన అతీతుడా అని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు జైలులో వుండటమే తప్పయినట్లుగా మాట్లాడుతున్నారని రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. అరెస్ట్ అయ్యాక ఎవరికీ ఇవ్వని సౌకర్యాలు చంద్రబాబుకు కల్పించారని ఆయన చెప్పారు. హౌస్ కస్టడీలో వుంచితే దానిని అరెస్ట్ అంటారా.. ఇంట్లో వుంచేదానికి అరెస్ట్ చేయడం ఎందుకు అని సజ్జల ప్రశ్నించారు. 

సానుభూతి, రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు పాకులాడారని ఆయన దుయ్యబట్టారు. యువత పేరు చెప్పి దోచుకున్నారని సజ్జల ఆరోపించారు. 2019 ఏప్రిల్‌లోనే సీమెన్స్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చిందని.. 2014 సెప్టెంబర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారని రామకృష్ణారెడ్డి తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు గంటా సుబ్బారావును ఎండీగా నియమించారని తెలిపారు. చిన్న కార్పోరేషన్ ఎండీని సీఎం చంద్రబాబుకు ఎందుకు లింక్ చేశారని సజ్జల ప్రశ్నించారు. 

2015 ఫిబ్రవరిలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌గా మార్చారని ఆయన తెలిపారు. గోబెల్స్ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పు కావన్నారు. అబద్ధాలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల ఆరోపించారు. దోచుకోవడానికే ఓ స్కీమ్ పెట్టారని.. షెల్ కంపెనీల ద్వారా క్యాష్‌గా మార్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు కూడా కేస్ స్టడీగా స్కిల్ స్కామ్‌ మారిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రూ.371 కోట్ల ప్రజల డబ్బు దోపిడి చేసి.. చంద్రబాబుకు చేరిందని బలమైన ఆధారాలున్నాయని ఆయన వెల్లడించారు. 

click me!