సీమ కష్టాలు తెలుసునని కేసీఆరే అన్నారు.. ఇప్పుడేమో ఇలా: జలవివాదంపై సజ్జల స్పందన

By Siva KodatiFirst Published Jul 2, 2021, 5:58 PM IST
Highlights

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం పరిష్కారం కావాలనే ప్రధాని నరేంద్రమోడీకి సీఎం జగన్‌ లేఖ రాశారన్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడమే రాయలసీమ ప్రాజెక్టు లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం పరిష్కారం కావాలనే ప్రధాని నరేంద్రమోడీకి సీఎం జగన్‌ లేఖ రాశారన్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడమే రాయలసీమ ప్రాజెక్టు లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని గతంలో సీఎం కేసీఆర్‌ అంగీకరించడమే కాకుండా ప్రోత్సహించారని సజ్జల గుర్తుచేశారు.

Also Read:జలవివాదం: ఏపీకి తెలంగాణ కౌంటర్, కేఆర్ఎంబీ తీరుపై కూడ అసంతృప్తి

రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా ఉంటానని కేసీఆర్ మాటిచ్చారని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో తానూ ఉన్నానని.. సీమ కష్టాలు తెలుసునని పరిష్కరించుకుందామని కేసీఆర్ ఆనాడు చెప్పారని ఆయన గుర్తుచేశారు. నీటి విషయంలో ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలని కేసీఆర్ అన్నారని సజ్జల వెల్లడించారు.  

ప్రాజెక్టులో 834 అడుగుల సామర్థ్యం నిల్వ ఉన్న సమయంలో విద్యుదుత్పత్తి మొదలు పెట్టాల్సి ఉండగా.. 800 అడుగుల కంటే తక్కువ సామర్థ్యం వద్దే తెలంగాణ జెన్‌కో ఉత్పత్తి చేస్తుందని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. దీంతో ప్రకాశం బ్యారేజీకి నిత్యం వచ్చిన నీరు వచ్చినట్లుగానే వదిలేయాల్సిన పరిస్థితులను సృష్టించారని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో నీటి కష్టాలు తప్పవని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.  

click me!