
హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామని ముందే తెలిసి పోలింగ్ కు ఒక రోజు ముందే చంద్రబాబు పెద్ద డ్రామాకు తెరలేపారని ఆరోపించారు.
ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు వెళ్తోందని చంద్రబాబు అనడం అర్థరహితమన్నారు. రాష్ట్రంలో 80శాతం పోలింగ్ జరిగిందని చంద్రబాబు కుటుంబం సహా ఓటు వేసిన వారెవరూ దీనిపై ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదని ప్రశ్నించారు.
కానీ చంద్రబాబు కు మాత్రమే ఈవీఎంలపై అనుమానాలు వస్తునన్నాయన్నారు. అసలు చంద్రబాబు సైకిల్ కు ఓటేశారా లేక ఫ్యాన్ కు ఓటేశారా అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ఏమైందో తెలియడం లేదన్నారు.
పోలింగ్ ఒక రోజు ముందు పెద్ద డ్రామాకు తెరలేపిన చంద్రబాబు సానుభూతి కోసమే ఈసీ కార్యాలయం ఎదుట బైఠాయించారని ఆరోపించారు. 2014లో ఇవే ఈవీఎంలపై చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు.
ఆనాడు తమ ఓటమిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుందాగా స్వీకరించారని తెలిపారు. 70 ఏళ్ల చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారో అంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు వెళ్తోందంటున్న చంద్రబాబు మానసిక స్థితిని వైద్యులే నిర్ధారించాలన్నారు.
దివంగత సీఎం ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడితే చంద్రబాబు మాత్రం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మరోవైపు ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు.
ప్రజలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థను తమ సొంత పనుల కోసం వినియోగించుకున్నారని ఇంటెలిజెన్స్ చీఫ్ ను సొంత పనులకు ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును మార్చడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదన్నారు.
ముగ్గురు ఐపీఎస్ అధికారులు తప్పితే మిగిలిన అధికారులంతా ఐదేళ్లు ప్రభుత్వంలో ఉన్నవారేకదా అని నిలదీశారు. గులామ్‌ల్లాగా పనిచేసే వారు లేరని చంద్రబాబుకు బాధ అంటూ సజ్జల ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగులు లక్షల మంది ఉన్నా చైతన్య, నారాయణ కాలేజీ సిబ్బందిని ఎందుకు వాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్లకు నీళ్లు, బిస్కెట్లు రాలేదని లోకేష్ ఆరోపించడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వంలో ఉన్న మీరు ఓటర్లకు మంచినీరు, బిస్కెట్లు పంపిణీ చెయ్యాల్సింది పోయి మళ్లీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈవీఎంలు పనిచేయకపోవడం కూడా అధికార పార్టీ వైఫల్యమేనన్నారు. మరోవైపు ఏపీ సీఎస్ సుబ్రహ్మణ్యం డీజీపీ ఆఫీస్ కు వెళ్లడం తప్పుకాదన్నారు. ఏపీ సీఎస్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. సీఎం హోదాలో ఉండి ఈసీ ఆఫీసుకు చంద్రబాబు వెళ్లలేదా అని నిలదీశారు. ప్రజలు నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారని తాము భావిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.