రాజధానికి లక్ష కోట్లు.. ఏ రాష్ట్రానికైనా భారమే: హైకోర్టు తీర్పుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

Siva Kodati |  
Published : Mar 04, 2022, 05:55 PM IST
రాజధానికి లక్ష కోట్లు..  ఏ రాష్ట్రానికైనా భారమే: హైకోర్టు తీర్పుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

సారాంశం

ఏపీ మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రం మొత్తం తమకు సమానమేనని.. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు

రాజధానికి లక్ష కోట్లంటే ఏ ప్రభుత్వం భరించలేదన్నారు వైసీపీ నేత (ysrcp), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్ (ys jagan) సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని సజ్జల ప్రశంసించారు. చంద్రబాబు ముఠా నిన్న వికారపు చేష్టలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్ధను తామంతా గౌరవిస్తామని.. మాది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం తమకు సమానమేనని.. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు. మీడియా పేరుతో టీడీపీ అజెండా మోస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు. ప్రజల  మైండ్‌ను విషపూరితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. అమరావతి పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారని రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామని సజ్జల స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాల కోసమే టీడీపీ డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. 

అంతకుముందు పాలన వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం  కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత (mekathoti sucharitha) స్పష్టం చేశారు. ఏపీలో మూడు రాజధానుల రద్దు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు (supreme court) వెళ్తామని తెలిపారు.  శుక్ర‌వారం గుంటూరు జిల్లా ప‌రిధిలోని ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీలో రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ ఏర్పాటు చేసిన‌ మ‌హిళా పార్ల‌మెంటును ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హోం మంత్రి సుచరిత.. రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని కేంద్రం పలుసార్లు చెప్పిందని తెలిపారు. 

హైకోర్టు తీర్పుపై గురువారం స్పందించిన బొత్స సత్యనారాయణ కూడా పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందన్నారు. రాజధాని అంటే భూములు, ఓ సామాజికవర్గం మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉండాలన్నారు. చంద్రబాబు మాదిరిగా వ్యక్తుల కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేయబోదని.. వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపడతామని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు. 

మూడు రాజధానులపై గురువారం హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరంలేదని.. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకెళ్తామని బొత్స (botsa satyanarayana) స్పష్టంచేశారు. పరిపాలన వికేంద్రీకరణపై తాము అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రస్తుతం సీఆర్‌డీఏ చట్టం అమల్లో ఉందని, అలాగే.. అమరావతి భూములను చంద్రబాబు హయాంలోనే హడ్కోకు తనఖా పెట్టారని.. ఇప్పుడేమీ కొత్తగా జరిగింది కాదని చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇస్తామన్నవి అన్ని ఇస్తున్నాం కదా అని అన్నారు. అయితే తాజగా హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని హోం మంత్రి సుచరిత వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇక, అమరావతి విషయంలో హైకోర్టు (ap high court) గురువారం కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ధర్మాసనం తెలిపింది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే