
పాలన వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఏపీలో మూడు రాజధానుల రద్దు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని తెలిపారు. శుక్రవారం గుంటూరు జిల్లా పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన మహిళా పార్లమెంటును ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హోం మంత్రి సుచరిత.. రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని కేంద్రం పలుసార్లు చెప్పిందని తెలిపారు.
అమరావతి అంశంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్తుందా..? అని ప్రశ్నించగా.. కచ్చితంగా వెళ్తామని హోం మంత్రి సమాధానమిచ్చారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందని.. రాజధానిని మొత్తం తరలిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
హైకోర్టు తీర్పుపై గురువారం స్పందించిన బొత్స సత్యనారాయణ కూడా పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందన్నారు. రాజధాని అంటే భూములు, ఓ సామాజికవర్గం మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉండాలన్నారు. చంద్రబాబు మాదిరిగా వ్యక్తుల కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేయబోదని.. వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపడతామని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు.
మూడు రాజధానులపై గురువారం హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరంలేదని.. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకెళ్తామని బొత్స స్పష్టంచేశారు. పరిపాలన వికేంద్రీకరణపై తాము అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రస్తుతం సీఆర్‌డీఏ చట్టం అమల్లో ఉందని, అలాగే.. అమరావతి భూములను చంద్రబాబు హయాంలోనే హడ్కోకు తనఖా పెట్టారని.. ఇప్పుడేమీ కొత్తగా జరిగింది కాదని చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇస్తామన్నవి అన్ని ఇస్తున్నాం కదా అని అన్నారు. అయితే తాజగా హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని హోం మంత్రి సుచరిత వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇక, అమరావతి విషయంలో హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ధర్మాసనం తెలిపింది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని తెలిపింది. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు అమరావతి రాజధాని నగరాన్ని ఆరు నెలల్లో నిర్మించాలని, మొత్తం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించింది.