ఎల్లకాలం పల్లకి మోయడమేనా.. మేం కూర్చొవద్దా : ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై వైసీపీ నేత నవీన్ నిశ్చల్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 1, 2023, 5:40 PM IST
Highlights

ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను ఉద్దేశిస్తూ వైసీపీ నేత నవీన్ నిశ్చల్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి తాము పల్లకి మోస్తూనే వున్నామని... తమకు కూర్చొనే అవకాశం లేదా అని ఆయన ప్రశ్నించారు. తాను పక్కా లోకల్ అన్న నవీన్ ఇక్కడే వుంటానని స్పష్టం చేశారు. 

ఓ వైపు వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో సీఎం జగన్ శ్రేణుల్ని సిద్ధం చేస్తుంటే.. నియోజకవర్గంలో నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి చోటా నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. కొందరైతే బాహాటంగానే పార్టీలోని తమ ప్రత్యర్ధులపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. 2024లో వైసీపీ అధికారంలోకి రాకపోతే.. తాము ఇక్కడే వుంటామని చెప్పగలరా అని నవీన్ ప్రశ్నించారు.

2013 నుంచి జెండా మోసి కేసుల్లో ఇరుక్కున్న వారికి వైసీపీ ఏం చేసిందని ఆయన నిలదీశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి తాము పల్లకి మోస్తూనే వున్నామని.. కానీ పల్లకిలో కూర్చొనే అవకాశం మాత్రం అధిష్టానం కల్పించలేదన్నారు. తాము కష్టపడి పంట పండిస్తున్నామని... దానిని అమ్మి, తినే హక్కు తమకే వుందని నిశ్చల్ వ్యాఖ్యానించారు. తాము నిజమైన కార్యకర్తలమని.. పార్టీని కాపాడాల్సిన బాధ్యత తమపై వుందని నవీన్ అన్నారు. తాను పక్కా లోకల్ అన్న ఆయన ఇక్కడే వుంటానని స్పష్టం చేశారు. 

ఇక .. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలోని చాలా చోట్ల అధికార పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు. తాజాగా ఉదయగిరి వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి వర్గం ఫ్లెక్సీలను ఎమ్మెల్యే శేఖర్ అనుచరులు చించివేయడం కలకలం రేపింది. దీనిపై చేజర్ల సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తీరు సరికాదని.. తామూ వైసీపీ నేతలమేనని ఆయన అన్నారు. ఎమ్మెల్యే దమ్ముంటే తనపై పోటీ చేయాలని సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. 

ALso REad: తాడికొండ వైసీపీలో వర్గ విభేదాలు.. ఉండవల్లి శ్రీదేవికి నిరసన సెగ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముందే అసమ్మతి స్వరాలు

ఇదిలావుండగా.. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డికి, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా సొంత ప్రభుత్వంపై ఆనం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే అలా మాట్లాడినట్లు ఆనం పేర్కొన్నారు. వైఎస్ హయాంలో ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్ట్‌లే పూర్తి కాలేదని రామనారాయణ రెడ్డి వెల్లడించారు.

ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆనం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతానన్నది ఊహాగానాలేనని రామ నారాయణ రెడ్డి కొట్టిపారేశారు. తన గురించి బాతు బచ్చాగాళ్లు మాట్లాడే మాటలు పట్టించుకోనని ఆయన తేల్చిచెప్పారు. కొందరు వెంకటగిరికి ఇన్‌ఛార్జ్‌గా వచ్చి పోటీ చేస్తామంటున్నారని.. ఇది చూసి తాను ఎమ్మెల్యేనేనని జనం అనుకుంటున్నారని ఆనం వ్యాఖ్యానించారు.

ఆ వెంటనే ఆనం రాంనారాయణ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. ఆనం మంచి వ్యక్తని పవన్ కల్యాణ్ ఎందుకన్నారని ఆయన ప్రశ్నించారు. నేదురుమల్లి పేరు విన్నా.. తన ఫోటో చూసినా నీకెందుకు భయమని రాంకుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. మున్సిపాలిటీలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయో నీకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తాను ఓడిపోయినా వెంకటగిరి వదిలిపోలేదని నేదురుమల్లి చురకలంటించారు. 

click me!