టీడీపీ ఆఫర్‌.. రాపాకపై నమ్మకముంది, అందుకే హైకమాండ్‌కు చెప్పలేదు : వైసీపీ నేత కేఎస్ఎన్ రాజు

By Siva KodatiFirst Published Mar 26, 2023, 3:38 PM IST
Highlights

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆఫర్ అందినట్లుగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనకు చెప్పారని తెలిపారు వైసీపీ నేత కేఎస్ఎన్ రాజు. అయితే రాపాకను నమ్మాను కాబట్టే ఇది పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లలేదని ఆయన పేర్కొన్నారు. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు సంబంధించి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత కేఎస్ఎన్ రాజు స్పందించారు. టీడీపీ ఆఫర్ విషయాన్ని రాపాక తన దృష్టికి తీసుకొచ్చారని.. రాపాకను నమ్మాను కాబట్టే ఇది పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లలేదని ఆయన పేర్కొన్నారు. వరప్రసాద్‌కు ఆఫర్ వచ్చిన రెండు రోజులకు తనకు విషయం చెప్పారని.. నష్టం జరుగుతుందని తెలిసి వుంటే సజ్జలతో కానీ ఆపై వాళ్లతో కానీ చెప్పుండేవాళ్లమని కేఎస్ఎన్ రాజు తెలిపారు. ఎన్నిక అయ్యాక కానీ క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలియదన్నారు. 

అంతకుముందు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం తనకే వచ్చిందని.. టీడీపీ పది కోట్లు ఆఫర్ చేసిందని ఆయన ఆరోపించారు. తన ఓటు అమ్మితే రూ.10 కోట్లు వచ్చేదని.. తన దగ్గర డబ్బు ఎక్కువై వద్దనలేదన్నారు. నా ఓటు కోసం తన మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారని రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు. అసెంబ్లీ దగ్గర కూడా ఓ రాజుగారు టీడీపీకి ఓటేయమన్నారని.. తెలుగుదేశానికి ఓటేస్తే మంచి పొజిషన్ వుంటుందని చెప్పారని రాపాక అన్నారు. జగన్‌ను నమ్మాను కాబట్టే టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని.. సిగ్గు శరం వదిలేస్తే తనకు పదికోట్లు వచ్చి వుండేవని వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఒకసారి పరువు పోతే సమాజంలో వుండలేమని ఆయన పేర్కొన్నారు. 

Also REad: టీడీపీ నుంచి తొలి బేరం నాకే.. సిగ్గు శరం వదిలేసుంటే 10 కోట్లు వచ్చేవి, కానీ : రాపాక వరప్రసాద్ సంచలనం

కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన షాక్‌కి గింగిరాలు తిరుగుతున్న వైసీపీకి .. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు శరాఘాతంలా తగిలాయి. సభలో బలం వుండటంతో పాటు విపక్ష పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల మద్ధతుతు ఏడు స్థానాలు తన ఖాతాలో పడతాయని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వ్యూహంతో షాకిచ్చారు. దీనికి తోడు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై చర్చ జరగుతోంది. 

ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వైసీపీ నుంచి ఈ నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. 

click me!