
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు (83) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని తన స్వగృహంలో బుధవారం కన్నుమూశారు. రాజోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులు.
ఆయన రాజోలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం 2009 ఎన్నికల్లో తన అనుచరుడు ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి.. అతడు విజయం సాధించేలా చాలా కష్టపడ్డారు. అనంతరం.. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి వైసీపీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన సతీమణి మల్లీశ్వరి.. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కృష్ణంరాజు మృతితో వైసీపీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు రాజీకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు. కాగా, ఆయన పార్థీవదేహాన్ని గురువారం ఉదయం సఖినేటిపల్లికి తరలించనున్నారు. తన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచి, అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.