వైసీపీలోనే వుంటా , ఒంగోలు నుంచే పోటీ చేస్తానన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి .. హఠాత్తుగా ఎందుకిలా..?

By Siva KodatiFirst Published Jan 6, 2024, 8:52 PM IST
Highlights

తాను నియోజకవర్గం కానీ, పార్టీ కానీ మారేది లేదనిమాజీ మంత్రి, జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ నుంచే , అది కూడా ఒంగోలు నుంచే పోటీ చేస్తానని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ అన్న మాట ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఈ పరిణామాలను వైసీపీలో అసంతృప్త నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే టికెట్ దక్కనివారు, దక్కదని తెలిసిన వారు పక్కచూపులు చూస్తున్నారు. కొందరు ఈపాటికే పసుపు కండువా కప్పుకోగా.. మరికొందరు అదే దారిలో వున్నారు. అయితే కొందరు అధికార పార్టీ నేతలపై పార్టీ మారబోతున్నారంటూ దుష్ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరు మాజీ మంత్రి, జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.

దీనిపై ఆయన స్పందించారు. తాను నియోజకవర్గం కానీ, పార్టీ కానీ మారేది లేదని బాలినేని స్పష్టం చేశారు. నిజానికి జగన్ రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో పదవి కోల్పోయిన నాటి నుంచి బాలినేనిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. దీనికి తోడు సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. దీనిపై పలుమార్లు ముఖ్యమంత్రి జగన్‌ను కూడా కలిశారు. ఇటీవల ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో బాలినేని భేటీ కావడం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. ఇద్దరూ కలిసి తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారనే టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో బాలినేని స్పందించారు. 

Latest Videos

వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ నుంచే , అది కూడా ఒంగోలు నుంచే పోటీ చేస్తానని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ నేతలతో టచ్‌లో వున్నట్లుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీలో వున్నవారంతా జగన్‌కు అండగా వుండాల్సిన సమయమని బాలినేని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. నిజానికి బాలినేనిని జగన్ గిద్దలూరుకు పంపించాలని భావిస్తున్నట్లుగా వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆయనకు ఇది ఇష్టం లేదని టాక్. అలాంటిది జగన్ నుంచి ఎలాంటి హామీ వచ్చింతో తెలియదు కానీ.. ఒంగోలు తన అడ్డా అని బాలినేని తేల్చిచెప్పేశారు. 

click me!