
విజయనగరం: విజయనగరం జిల్లా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రలో దర్శనమిచ్చిన 108 అంబులెన్స్ వైసీపీ, టీడీపీల మధ్య ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆదివారం వైఎస్ జగన్ చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో ప్రసంగిస్తున్న సమయంలో 108 వచ్చింది. 108కు సైడ్ ఇవ్వాలని జగన్ కార్యక్ర్తలకు సూచించారు.
ఆరోగ్యశ్రీపై తాను చేసిన విమర్శలకు సమాధానం చెప్పేందుకు గాను అంబులెన్స్ లను ప్రభుత్వం ఇలా తిప్పుతోందని జగన్ విమర్శించారు. అంబులెన్స్ లో పేషేంట్ ఎవరూ లేరని అంటూనే అంబులెన్స్ కు దారి ఇవ్వాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రభుత్వానిది నీకృష్టమైన ఆలోచన.. వికృతమైన చర్య అంటూ మండిపడ్డారు.
108పై జగన్ వ్యాఖ్యలకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. అంబులెన్స్‌లో ఉంది వైసీపీ కార్యకర్తేనని తెలిపారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం తాటిపూడి గ్రామానికి చెందిన వల్లూరి శ్రీనివాస్ నీ సభ కోసం లారీలో అక్కడి వచ్చాడని కిందకు దిగుతుండగా కార్యకర్తలతో ఉన్న మరో ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు.
దీంతో అక్కడున్న కార్యకర్తలు 108కి ఫోన్ చేశారని.. ఘటనాస్థలికి చేరుకున్న108 వాహనం అతన్ని తీసుకుని ఎటు వెళ్లాలో తెలియక ఒకే రోడ్ ఉండటంతో నువ్వు నిలుచున్న వైపు వచ్చిందన్నారు. జనం దగ్గర మార్కులు కొట్టేయడానికి జరగండి.. జరగండి అంటూ జగన్ డ్రామాలు ఆడారని ఉమా ఆరోపించారు.
ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జగన్ గారికి రాజకీయాల్లోకి వచ్చి ఇంతకాలమైనా బహిరంగసభలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదా అని దేవినేని ప్రశ్నించారు. సభలు, సమావేశాలు విశాలమైన మైదానాల్లో పెట్టుకుంటారని.. అంతేకానీ సందుల్లో, గొందుల్లో బహిరంగసభలు పెట్టరని మంత్రి ఎద్దేవా చేశారు.
మరోవైపు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అంబులెన్స్ లో ఎవరూ లేరని బొత్స సత్యనారాయణ తెలిపారు. అది ఖాళీగానే వెళ్లిందన్నారు. అంబులెన్స్ లో పేషెంట్ ఉన్నారని నిరూపిస్తారా అంటూ సవాల్ విసిరారు. అంబులెన్స్ లో రోగులు ఎవరూ లేరని డ్రైవర్ తో తానే మాట్లాడినట్లు బొత్స తెలిపారు.
మెుత్తానికి 108 ఇరు పార్టీల మధ్య సవాల్ కు కారణమైంది. అంబులెన్స్ జగన్ ప్రసంగిస్తున్నప్పుడే ఎందుకు వచ్చింది..జగన్ ఆరోపిస్తున్నట్లు కావాలనే పంపించారా..లేక యాధృచ్చికంగా వచ్చిందా అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.