రీపోలింగ్ అంటే భయమెందుకు: బాబుపై రాంబాబు ఫైర్

By Siva KodatiFirst Published May 17, 2019, 1:38 PM IST
Highlights

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. 

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు జూన్ 8వ తేదీ వరకు ముఖ్యమంత్రిని అన్నారే కానీ.. ఆ తర్వాత కూడా తానే సీఎంని అని చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు.

తన ఓటమి తథ్యమని చంద్రబాబు గ్రహించారు కాబట్టే ఇలాంటి మాటలు ఆయన నోటి వెంట వస్తున్నాయని ధ్వజమెత్తారు. పోలింగ్ ముగిసిన నాటి నుంచి చంద్రబాబు మాట తీరులో మార్పు వచ్చిందని.. ప్రజాస్వామ్యంలో ఏ విధమైన ఫలితాలు వచ్చినా హుందాగా స్వీకరించాలని సూచించారు.

ఆరు వారాల్లో 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని... ఇలాంతటి అంశంపై ముఖ్యమంత్రి దృష్టిసారించకుండా ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితులతో ఓటు వేయించకుండా అక్కడి అగ్రవర్ణాలు అడ్డుపడ్డారని మా పార్టీ చంద్రగిరి అభ్యర్ధి ఎన్నికల సంఘానికి ఏప్రిల్ 12న ఫిర్యాదు చేశారని రాంబాబు గుర్తు చేశారు.

దీనిపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. దీనిపై సీఎం సహా తెలుగుదేశం నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.

బాబు రీపోలింగ్ అప్రజాస్వామికమని అంటున్నారని.. బాబు మాటల్లో చెప్పాలంటే అసలు ఎన్నికలే అప్రజాస్వామికం అన్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు తీరు చూస్తే శాశ్వతంగా తానే ముఖ్యమంత్రిగా ఉండాలని భావిస్తున్నట్టుగా ఉందన్నారు.

ఆయనో రాజులాగా లోకేశ్ యువరాజులా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారని రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపితే తెలుగుదేశానికి భయమెందుకు... ఈవీఎంలు, వీవీప్యాట్స్, ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రజలపై చంద్రబాబుకు విశ్వాసం లేదని.. అలాంటి వారు రాజకీయాలకు పనికిరారని రాంబాబు వ్యాఖ్యానించారు.
 

click me!