జగన్ మాటే శాసనం, గీత దాటితే చర్యలే:మాజీమంత్రి ఆనంకు విజయసాయిరెడ్డి వార్నింగ్

By Nagaraju penumalaFirst Published Dec 7, 2019, 3:05 PM IST
Highlights

ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా మాఫియా లేదని తెలిపారు. 
 

అమరావతి: మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. వైసీపీలో జగన్ మాటే శాసనం అని అది ఎవరు దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు. 

నెల్లూరు జిల్లాలో మాఫియా చెలరేగిపోతుందంటూ ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ఎవరూ పార్టీ గీతదాటొద్దని హెచ్చరించారు. 

ఎలాంటి సమస్యలు ఉన్నా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలే తప్ప అంతర్గత అంశాలు మీడియా ముందుకు తీసుకువస్తే సహించేది లేదంటూ ఘాటుగా హెచ్చరించారు. 

పార్టీలో ఎంతటి వారైనా గీత దాటితే చర్యలు తప్పవన్నారు విజయసాయిరెడ్డి. పార్టీలో ఉన్న తాను అయినా లేకపోతే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అయినా లేక మరోకరైనా సరే మినహాయింపు లేదని పార్టీకి విధేయతతోపాటు క్రమశిక్షణ సైతం అవసరం అన్నారు.

నెల్లూరు జిల్లలో వైసీపీ నేతల మధ్య ఎలాంటి విబేధాలు లేవన్నారు. ఆనం ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు. తమకు ఒక్కరే నాయకులు అని అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. బహుశా గత ప్రభుత్వం గురించి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడి ఉండొచ్చని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా మాఫియా లేదని తెలిపారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుందని తెలిపారు. ఆనం రాంనారాయణరెడ్డి ఎందుకు అలా మాట్లాడారో తెలియదని ఆయననే వివరణ అడగాలంటూ చిర్రబుర్రులాడారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

ఇకపోతే శుక్రవారం వెంకటగిరిలో ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా అనేక మాఫియాలు అడ్డాగా మారిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు పట్టణం ఒక అడుగు ముందుకు వేయాలి అన్నా అధికారులకు వాళ్ళ ఉద్యోగ భద్రత గుర్తొస్తుందన్నారు. 

నెల్లూరు నగరంలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు, మీకు ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు పట్టణం అందుకు కేంద్రంగా మారిందన్నారు. ఈ మాఫియా ఆగడాలకు నెల్లూరు పట్టణంలో వేలాది కుటుంబాలు లక్షలాది ప్రజలు బలయ్యారన్నారు. 

వారంతా బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఐదు సంవత్సరాలలో నలుగురు ఎస్పీలు మారిన ఘనత నెల్లూరు జిల్లాకే దక్కిందంటూ మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. 

video: సొంత పార్టీ నాయకులపైనే మాజీ మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు

click me!