నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వైసీపీ కౌన్సిలర్ సురేష్ ను సోమవారం నాడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పుట్టినరోజునే సురేష్ హత్యకు గురయ్యాడు.
నెల్లూరు:నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేటలో వైసీపీ కౌన్సిలర్ సురేష్‌ను కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.భార్య, బిడ్డలతో తిరుమల దర్శనానికి వెళ్లివచ్చిన సురేష్ కారు పార్కింగ్ చేస్తుండగా దుండగులు పక్కా ప్లాన్‌తో రెక్కి నిర్వహించి హత్యచేశారు.
అయితే, సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటెజ్‌ను పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇవాళ సురేష్ పుట్టిన రోజు. దీంతో తిరుమలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి వచ్చారు.
సూళ్లూరుపేట రైల్వేగేటు సమీపంలో కారును పార్క్ చేస్తున్న సమయంలో పక్కా పథకం ప్రకారంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు.పుట్టినరోజునే కౌన్సిలర్ సురేష్ హత్యకు గురికావడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.సురేష్ ను ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.