Latest Videos

బాబుకి హనీమూన్ అవ్వనివ్వండి... వైసిపి  తడాఖా చూపిద్దాం : జగన్ మోహన్ రెడ్డి

By Arun Kumar PFirst Published Jun 13, 2024, 4:49 PM IST
Highlights

ఇప్పుడే టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది... ఇంకా మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరగలేదు. అప్పుడే ప్రతిపక్ష వైసిపి చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ సీఎం జగన్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అమరావతి : ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మొదటిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసిపి ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన స్పందించారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసారు... ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాబట్టి చంద్రబాబు ఇంకా హనీమూన్ కాలంలోనే వున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ఇంకొంత సమయం ఇద్దాం... అప్పటివరకు వేచివుందాం అని ఎమ్మెల్సీలకు సూచించారు మాజీ సీఎం, వైసిపి అధినేత జగన్. 

ఎన్నికల సమయంలో, ఫలితాలు వెలువడ్డాక వైసిపి నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. కార్యకర్తల్లో ధైర్యం నింపేలా కార్యక్రమాలను చేపడదామని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజల్లోనే వుండేలా... ప్రభుత్వాన్ని ఎండగట్టేలా కార్యక్రమాలను రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రజలతో కలిసి పోరాటం చేద్దామని... కొద్దిరోజుల్లోనే మళ్లీ యాక్టివ్ అవుదామని జగన్ సూచించారు. 

గతంలోనూ ఇలాగే ప్రతిపక్షంలో వున్నాము... ఆనాడు ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశామని వైఎస్ జగన్ గుర్తుచేసారు. తనకేమీ వయసు అయిపోలేదు... ఆనాడు పాదయాత్ర సమయంలోని వయసే ఇప్పుడు వుందన్నారు. మళ్లీ  ప్రజల్లోకి వెళ్లే సత్తువ వుంది... ఆ సమయం వచ్చేవరకు వేచి చూద్దామన్నారు. అప్పటివరకు మీరు ప్రజల్లో వుండాలని... వారి పక్షాన నిలవాలని ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు.

ఇటీవల జరిగిన ఎన్నికలు, ఫలితాలను చేసి ఎవ్వరు అధైర్యం పడొద్దని వైఎస్ జగన్ సూచించారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి... అదే మాదిరిగా మళ్లీ 2024 నుంచి 2029 వరకు కూడా ఇట్టే గడుస్తాయన్నారు. ఓ విషయం గుర్తుంచాలి... ప్రస్తుతం సినిమాలో ఫస్టాఫ్ మాత్రమే జరుగుతోంది. ఇంకా చాలా సినిమా మిగిలే వుందున్నారు. ఐదేళ్ల క్రితం మనం గెలవగానే ఇలాంటి పరిస్థితే వుంది... అప్పుడు టిడిపి ఇక బ్రతకలేదని అన్నారు. మనం ఎంతలా పైపైకి లేచామో అందరికీ గుర్తుచేసుకోవాలన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగ వుండవు...  మారుతుంటాయని జగన్ అన్నారు. 
 
ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ కూడా అలాగే ఉంది... ఇంటింటికీ మనంచేసిన మంచి బ్రతికే ఉందన్నారు. మనంచేసిన పాలనమీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉందన్నారు. మనపట్ల విశ్వసనీయత ఇంకా ఉందన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యమన్నారు. కాకపోతే కొంత సమయం పడుతుంది.... ఆ సమయం మనం ఇవ్వాలన్నారు. టైం ఇచ్చినప్పుడే, వాళ్ల పాపాలు పండినప్పుడే మనం ఖచ్చితంగా పైకి లేస్తాం... ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

రాజకీయాల్లో అన్నికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత... ఈ పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరమని జగన్ అన్నారు. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు... అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నదికూడా రాజకీయమేనన్నారు. అధికారంలో లేనప్పుడు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి...  కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉందన్నారు. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయతలేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ, హుందాగా నిలబడుతూ, ముందడుగులు వేద్దామా? ఇలా కష్టపడితేనే మళ్లీ అధికారంలోకి వస్తామన్నది గుర్తుంచుకోవాలని సూచించారు. 

అసెంబ్లీలో మనకు సంఖ్యాబలం పెద్దగాలేదు.... కాబట్టి ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం రాకపోవచ్చు, గొంతు విప్పనివ్వకపోవచ్చని అన్నారు. కానీ  శాసన మండలిలో మనకు బలం ఉంది... దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. కాబట్టి మండలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని జగన్ సూచించారు. 

మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు... మహా అయితే నాలుగు కేసులు పెట్టగలుగుతారని జగన్ అన్నారు. అంతకు మించి వాళ్లు ఏం చేయలేరని అన్నారు.  సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి.... మన కళ్లముందే టిడిపి ప్రభుత్వం ఎలాంటి పాపాలు చేస్తుందో గతంలో మనమంతా చూశామన్నారు. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు... చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది చూడకుండా ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశామన్నారు. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకం ప్రతి ఇంటికే అందించామని జగన్ పేర్కొన్నారు. 

అయితే ప్రస్తుతం కేవలం వాళ్ల పార్టీకి ఓటువేయకపోవడమే పాపం అన్నట్టుగా టిడిపి వాళ్ళు రావణకాష్టం సృష్టిస్తున్నారు... విధ్వంసం చేస్తున్నారని జగన్ ఆందోళన వ్యక్తం చేసారు. ఆస్తి నష్టంలో పాటు భౌతిక దాడులకు దిగుతున్నారు... వైసిపి వాళ్లను అవమానిస్తున్నారు... ఇంకా ఎన్నో అమానుషాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇవన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయని అన్నారు.

చంద్రబాబు రెండో పాపంకూడా అప్పుడే పండింది... కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవని జగన్ అన్నారు. కేంద్రంలో 240 సీట్లకు బిజెపి పరిమితం కావడం... మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి సంఖ్యరావడంతో ఎన్టీయేలో కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకహోదాను సాధించకుంటే అది చంద్రబాబు చేసే మరో పాపం అవుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా రాకుంటే ప్రజలు టిడిపిని, చంద్రబాబును క్షమించరని జగన్ హెచ్చరించారు. 

ప్రస్తుతం అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? అన్నది సందేహమే అని జగన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి బయటవున్నది వైసిపి మాత్రమే... కాబట్టి నైతిక విలువలు పాటిస్తూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ సూచించారు. ఏ హోదా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి పోరాడతామన్నారు.  
  

click me!