నువ్వుగెలుస్తున్నందుకు ఇంటికొచ్చి సన్మానం చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి వల్లభనేని వంశీ ఫోన్

By Nagaraju penumalaFirst Published May 3, 2019, 9:15 PM IST
Highlights

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనను బెదిరిస్తున్నాడంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం సంచలనంగా మారింది. వల్లభనేని వంశీ ఇటీవలే యార్లగడ్డకు ఫోన్ చేసి అన్న నువ్వు గెలుస్తున్నావ్ ఇంటికి వచ్చి సన్మానం చెయ్యాలనుకుంటున్నానను అని అన్నారట. 

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గన్నవరం నియోజకవర్గం నుంచి అధికార టీడీపీ తరపున వల్లభనేని వంశీమోహన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రావులు పోటీ చేశారు. 

వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారం ప్రత్యర్థులిద్దరూ విమర్శలు, ప్రతి విమర్శలతో నియోజకవర్గాన్ని హోరెత్తించారు. ఒక్కోసారి ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న సందర్భాలు లేకపోలేదు. ఇక ఎన్నికలు పూర్తయిపోయాయి. అటు యార్లగడ్డ వెంకట్రావ్, ఇటు వల్లభనేని వంశీమోహన్ లు ఎవరిపనుల్లో వారు బిజీగా ఉన్నారు. 

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనను బెదిరిస్తున్నాడంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం సంచలనంగా మారింది. వల్లభనేని వంశీ ఇటీవలే యార్లగడ్డకు ఫోన్ చేసి అన్న నువ్వు గెలుస్తున్నావ్ ఇంటికి వచ్చి సన్మానం చెయ్యాలనుకుంటున్నానను అని అన్నారట. 

ఆసమయంలో తాను ఇంట్లోలేనని యార్లగడ్డ చెప్పుకొచ్చారట. ఆ తర్వాత వంశీ నేరుగా యార్లగడ్డ ఇంటికి వెళ్లడంతో అక్కడ ఆయన లేకపోవడంతో వెనుదిరిగారట. దీంతో కంగారుపడ్డ యార్లగడ్డ వెంకట్రావ్ తనను వంశీ బెదిరిస్తున్నారని భావించి సీపీని ఆశ్రయించారట. 

మాజీఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావుతో కలిసి విజయవాడ సీపీని కలిశారు. తనను వంశీ బెదిరిస్తున్నారంటూ మెురపెట్టుకున్నారట. అలాగే తన ఇంటికి వల్లభనేని వంశీ వచ్చాడని అందుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ సైతం అందజేశారట. 

సీసీ టీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపడతామని చెప్పుకొచ్చారట. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్స్ ఆధారాలు ఇవ్వడంతో సీపీ ఈ కేసుపై దృష్టి సారించారట. డీసీపీ స్థాయి అధికారితో విచారణ చేయించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే వల్లభనేని వంశీమోహన్ సామరస్య పూర్వకంగానే ఫోన్ చేశారని, మనస్ఫూర్తిగా కలిసేందుకే వెళ్లారే తప్ప అందులో ఎలాంటి బెదిరింపులు లేవని వంశీ వర్గీయులు చెప్తున్నారట. వైసీపీ మాత్రం వంశీ సన్మానం వెనుక ఏదో ఉందని అనుమానం వ్యక్తం చేస్తోందట. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల ఫలితాల టెన్షన్లో ఉన్న తరుణంలో ఈ వ్యవహారం కాస్త రాజకీయంగా కలకలం రేపుతోంది. 


 

click me!