ఆ మంత్రిని ఓడిస్తే..ఈ ఎమ్మెల్యేకి మంత్రి పదవి కన్ఫమ్

By Nagaraju penumalaFirst Published May 3, 2019, 8:40 PM IST
Highlights

ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ మంత్రి నారాయణను ఓడిస్తే కీలకపదవి ఖాయమంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెల్లూరు జిల్లా నుంచి మంత్రి పదవి వరించే అవకాశం ఉందని సమాచారం. 

నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో గెలిచారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. 

అంతేకాదు రోజురోజుకు అధినేత వైఎస్ జగన్ కు మరింత దగ్గరయ్యారు. వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ జగన్ కు చేరువయ్యారు. వైఎస్ జగన్ సైతం అనిల్ కుమార్ యాదవ్ కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. 2019 ఎన్నికల్లోనూ ఆయనకు మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 

అయితే గత ఎన్నికల్లో కంటే 2019 ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారు అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ పై పోటీ చేసింది మామూలు వ్యక్తికాదు తెలుగుదేశం పార్టీలో కీలక నేత, మంత్రి నారాయణ. 

నారాయణ విద్యాసంస్థల అధినేతగా పేర్గాంచిన ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా వ్యవహరించారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్, నారాయణల మధ్య టఫ్ ఫైట్ నడిచిందని అంతా చెప్పుకుంటున్నారు. అయితే కొన్ని సర్వేలు మాత్రం అనిల్ కుమార్ యాదవ్ కు అనుకూలంగా ప్రకటనలు ఇస్తున్నాయి. 

ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ మంత్రి నారాయణను ఓడిస్తే కీలకపదవి ఖాయమంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెల్లూరు జిల్లా నుంచి మంత్రి పదవి వరించే అవకాశం ఉందని సమాచారం. 

నెల్లూరు జిల్లా రాజకీయాలను ఒకప్పుడు ఒంటి చేత్తో ఏలిన ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని కొంతమది ప్రచారం చేస్తుంటే ఇంకొంతమంది మాత్రం మంత్రిపదవి అనిల్ కుమార్ యాదవ్ కే దక్కుతుందంటూ నెల్లూరు జిల్లాలో ప్రచారం చేసుకుంటున్నారు. 

అధినేత వైఎస్ జగన్‌ వెంట ఉంటూ పార్టీని నమ్ముకుని మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి స్థానం లభిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోనే మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు అనిల్. 

అనిల్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు, కార్యకర్తలు అక్కడ వాలిపోవాల్సిందే. ఏది ఏమైనప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ లక్ ఎలా ఉందో అన్నది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే. 

click me!